‘గెయిల్‌’పై దిగ్గజాల కన్ను! | Sakshi
Sakshi News home page

‘గెయిల్‌’పై దిగ్గజాల కన్ను!

Published Tue, Dec 26 2017 12:33 AM

Gail lean on merger in ONGC - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) చమురు–గ్యాస్‌ రంగంలో విలీనాలు మరింత జోరందుకోనున్నాయి. పీఎస్‌యూ గ్యాస్‌ అగ్రగామి గెయిల్‌ను కొనుగోలు చేసేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) ఈ విషయంలో పోటీపడుతున్నాయి. సహజవాయువు ప్రాసెసింగ్, పంపిణీ చేసే గెయిల్‌ను కొనుగోలు చేయడం ద్వారా సమగ్ర ఇంధన వనరుల సంస్థగా ఎదగాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఐవోసీ, బీపీసీఎల్‌.. కేంద్ర చమురు శాఖకు తమ ప్రతిపాదనలు పంపించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, గెయిల్‌ మాత్రం ప్రభుత్వ రంగ గ్యాస్, చమురు దిగ్గజం ఓఎన్‌జీసీలో విలీనమే సరైన నిర్ణయం కాగలదని భావిస్తోంది. గ్యాస్‌ ఉత్పత్తి చేసే దిగ్గజానికి తమ రవాణా, మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ తోడైతే.. సమగ్రమైన ఇంధన సంస్థగా ఎదగవచ్చని యోచిస్తోంది. గెయిల్‌లో ప్రభుత్వానికి 54.89 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ. 46,700 కోట్లు. 

ఈ ఏడాది బడ్జెట్లో బీజం... 
దేశ, విదేశాల్లోని ప్రైవేట్‌ రంగ చమురు, గ్యాస్‌ దిగ్గజ సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగంలోనూ భారీ స్థాయి కంపెనీల రూపకల్పన దిశగా కసరత్తు చేస్తున్నట్లు 2017–18 బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ.. విలీనాల అవకాశాలను సూచనప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక పీఎస్‌యూని మరో పీఎస్‌యూలో విలీనం చేయడం ద్వారా వాటిపై నియంత్రణ అధికారం కోల్పోకుండానే.. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకోవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. అదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీపడే దీటైన కంపెనీల సృష్టికి, తద్వారా చమురు రేట్లలో హెచ్చుతగ్గులను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తోంది. 

ఇప్పటికే హెచ్‌పీసీఎల్‌ విలీన ప్రక్రియలో ఓఎన్‌జీసీ.. 
ఓఎన్‌జీసీ ప్రస్తుతం చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్‌ సంస్థ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసే పనిలో ఉంది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. హెచ్‌పీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న 51.11% వాటాలను ఓఎన్‌జీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 33,000 కోట్లుగా ఉంటుంది. ఓఎన్‌జీసీ– హెచ్‌పీసీఎల్‌ డీల్‌ పూర్తయిన తర్వాతే.. గెయిల్‌ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ప్రతిపాదనలివీ.. 
దేశీయంగా అతి పెద్ద చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్‌ సంస్థ అయిన ఐవోసీ.. మరో రిఫైనర్‌ని లేదా గెయిల్‌ వంటి గ్యాస్‌ కంపెనీని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. నగరాల్లో గ్యాస్‌ సరఫరా ప్రాజెక్టులు, గ్యాస్‌ మార్కెటింగ్‌ తదితర కార్యకలాపాలతో పాటు ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్‌ నిర్మాణం మొదలైనవి.. గెయిల్‌ వంటి గ్యాస్‌ సంస్థ కొనుగోలుకు తోడ్పడే అంశాలని భావిస్తోంది. దేశంలోనే అతి పెద్ద గ్యాస్‌ రవాణా, మార్కెటింగ్‌ కంపెనీ అయిన గెయిల్‌ని దక్కించుకుంటే సమగ్రమైన ఇంధన దిగ్గజంగా ఎదగవచ్చని యోచిస్తోంది. మరోవైపు, గ్యాస్‌ వ్యాపార విభాగంలో దిగ్గజంగా ఎదగడంపై కసరత్తు చేస్తున్న బీపీసీఎల్‌ కూడా గెయిల్‌పై తమ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. కొనుగోలు చేసేందుకు తమ మొదటి ప్రాధాన్యత గెయిల్‌కే ఉంటుందని పేర్కొంది. లేని పక్షంలో రెండో ప్రాధాన్యం కింద ఆయిల్‌ ఇండియా (ఆయిల్‌) ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఆయిల్‌లో కేంద్రానికి 66.13 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం దీని విలువ రూ. 18,000 కోట్లు ఉంటుంది. ఈ విలీనాలు పూర్తయితే, ప్రభుత్వ రంగంలో మొత్తం చమురు–గ్యాస్, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల సంఖ్య మూడుకు చేరే అవకాశం ఉంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement