
ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌తో అవినీతికి చెక్
అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న ఆవిష్కరించబోయే ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ డ్రైవ్.. అవినీతిని అరికట్టడానికి తోడ్పడగలదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు.
ముంబై: అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న ఆవిష్కరించబోయే ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ డ్రైవ్.. అవినీతిని అరికట్టడానికి తోడ్పడగలదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఇది పేదలకు అవకాశాలను, గౌరవాన్ని తెచ్చిపెట్టడంతో పాటు సేవల కోసం గతంలోలాగా అర్థించాల్సిన అవసరం లేకుండా చేయగలదని రాజన్ పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి లలిత్ దోషి స్మారక కార్యక్రమంలో పాల్గొన్న రాజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదును బదిలీ చేయడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
జమాఖర్చుల విషయంలో పురుషుల కన్నా మహిళలే జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వారి ఖాతాల్లోకే నగదును బదిలీ చేయడం మంచిదని చెప్పారు. అటు పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపిస్తుంటేనే నగదు బదిలీ వర్తింపచేయడం తదితర నిబంధనలు విధించడాన్ని కూడా పరిశీలించవచ్చని రాజన్ పేర్కొన్నారు. కరెన్సీపై గాంధీజీ బొమ్మ మినహా వేరొకరి చిత్రాన్ని ముద్రించే ప్రశ్నే లేదని రాజన్ స్పష్టం చేశారు.