ఉత్తరాది నగరాలకూ ట్రూజెట్‌

ఉత్తరాది నగరాలకూ ట్రూజెట్‌


టెండర్లలో పాల్గొననున్న టర్బో మేఘా

సెప్టెంబర్‌కల్లా మరో 18 సర్వీసులు

ఆరు నెలల్లో కొత్తగా 4 విమానాలు

‘సాక్షి’తో కంపెనీ ఎండీ ఉమేశ్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రూజెట్‌ పేరుతో విమానయాన రంగంలో ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ కొత్త నగరాలకు సర్వీసులు విస్తరించటంపై ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ మహారాష్ట్ర, గుజరాత్‌లోనూ అడుగుపెట్టడానికి ఉడాన్‌ ప్రాజెక్టు కింద ఈ నెలలో జరిగే టెండర్లలో పాల్గొనబోతోంది. ఈ రాష్ట్రాల్లో కమర్షియల్‌ రూట్లలో సైతం సర్వీసులు నడుపనున్నట్టు సంస్థ ఎండీ ఉమేష్‌ వంకాయలపాటి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు.మూడు నాలుగు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయి రూట్ల కేటాయింపు జరగొచ్చని వెల్లడించారు. జనవరి–ఫిబ్రవరికల్లా మహారాష్ట్ర, గుజరాత్‌లోని ప్రధాన ద్వితీయ శ్రేణి నగరాల్లో సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. ట్రూజెట్‌ దేశంలో తొలిసారిగా షెడ్యూల్డ్‌ కమ్యూటర్‌ ఆపరేటర్‌గా మే నెలలో అనుమతి పొందింది. దీంతో మెట్రోల నుంచి ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందించేందుకు కంపెనీకి వీలు కలిగింది.అదనపు సర్వీసులు..

ప్రస్తుతం ట్రూజెట్‌ 11 నగరాలకుగాను రోజుకు 28 సర్వీసులను నడిపిస్తోంది. సెప్టెంబర్‌ చివరినాటికి మరో నాలుగు నగరాలను అనుసంధానిస్తోంది. తద్వారా రోజుకు కొత్తగా 18 సర్వీసులను జోడించనుంది. కంపెనీ ఖాతాలో ఇప్పుడు ఏటీఆర్‌–72 రకం ఫ్లైట్‌లు నాలుగు ఉన్నాయి. ఆగస్టులో ఒకటి, సెప్టెంబర్‌లో మరొక విమానం వచ్చి చేరుతోంది. ఇవేగాక మహారాష్ట్ర, గుజరాత్‌ కోసం మరో రెండు విమానాలు అవసరం అవుతాయని కంపెనీ భావిస్తోంది. కంపెనీ దక్కించుకునే రూట్లనుబట్టి కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కేంద్రంగా కొల్హాపూర్, షోలాపూర్, జల్‌గావ్, నాసిక్, గోందియా, లాతూర్‌ వంటి నగరాలకు సర్వీసులను విస్తరిస్తారు. ఇక కంపెనీలో ప్రస్తుతం 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. విస్తరణలో భాగంగా కొత్తగా 100 మందిని నియమించుకోనున్నారు.ఈ ఏడాది మరో రూ.70 కోట్లు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.60–70 కోట్లు వెచ్చించనున్నట్టు ఉమేష్‌ వెల్లడించారు. నిధుల సమీకరణ ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. ఉడాన్‌ ప్రాజెక్టుతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, కంపెనీకి ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. ‘‘టికెట్ల ధరల సవరణ ఇప్పట్లో లేదు. మా విమానాల్లో ఆక్యుపెన్సీ రేటు 80–85 శాతంగా ఉంది. సివిల్‌ ఏవియేషన్‌ నుంచి షిర్డీ విమానాశ్రయానికి ఇంకా క్లియరెన్సు రావాల్సి ఉంది. అనుమతి రాగానే అక్కడికి సర్వీసులు ఆరంభిస్తాం’’ అని వివరించారు. బుధవారం నాటితో కంపెనీ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండేళ్లలో 7.60 లక్షల మంది తమ విమానాల్లో ప్రయాణించినట్లు ఉమేష్‌ వెల్లడించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top