
భారీగా దెబ్బతిన్న కొనుగోళ్ల సెంటిమెంట్..
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోళ్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం
సాక్షి, అమరావతి: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల కొనుగోళ్ల సెంటిమెంట్ దారుణంగా దెబ్బతింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న ఇండియాస్ బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ తొలిసారిగా భారీగా పడిపోయింది. గత ఏడాది జూలై నెలలో 0.43గా ఉన్న బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ ప్రతీ నెలా పెరుగుతూ నవంబర్ నాటికి 0.68 పాయింట్లుకు చేరుకోగా, నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ నాటికి ఈ ఇండెక్స్ 0.26 పాయింట్లకు పడిపోయింది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లో 3,000 మంది వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా మూడు నెలలకు ఒకసారి ఈ ఇండెక్స్‌ను లెక్కిస్తారు.
ఈ ఏడాది జూలై నుంచి ప్రజల కొనుగోళ్ల సెంటిమెంట్ క్రమేపీ పెరుగుతూ వస్తోందని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు ప్రకటన చేసిన తర్వాత ఈ సెంటిమెంట్ తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని టీఆర్‌ఏ రీసెర్చ్ సీఈవో ఎన్.చంద్రమౌళి పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిసారి జీతాలు అందుకున్న డిసెంబర్ నెలలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. అన్నిటికంటే అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో కొనుగోళ్ల సెంటిమెంట్ దెబ్బతినగా అత్యల్పంగా హైదరాబాద్‌లో దెబ్బతింది.
కానీ వీటికి భిన్నంగా అహ్మదాబాద్‌లో మాత్రం కొనుగోళ్ల సెంటిమెంట్ పెరగడం గమనార్హం. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్ నెలలో ఢిల్లీలో బయ్యింగ్ ప్రోపెన్సిటీ ఇండెక్స్ 122 శాతం పడిపోయింది. ఆ తర్వాత కోల్‌కతా 90 శాతం, ముంబై 58 శాతం, పూణే 46 శాతం, చెన్నై 35 శాతం, బెంగళూరు 16 శాతం, హైదరాబాద్ 15 శాతం క్షీణించాయి. కానీ ఒక్క అహ్మదాబాద్‌లో మాత్రం ఇండెక్స్ 17 శాతం పెరగడం విశేషం.