కస్టమర్లకు బ్యాంకులు వార్నింగ్‌

Banks warn of new mobile malware, 232 banking apps in danger - Sakshi

ముంబై : బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. తమ మొబైల్‌ బ్యాంకింగ్‌ ఆధారాలు కొత్త మాల్‌వేర్‌ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందంటూ... జాగ్రత్తగా ఉండాలంటూ ఈ హెచ్చరికలు పంపుతున్నాయి. ఫ్లాష్‌ ప్లేయర్‌  ద్వారా బ్యాంకింగ్‌ యాప్స్‌పై  మాల్‌వేర్‌ అటాక్‌ చేస్తుందని పేర్కొంటున్నాయి. పలు భారతీయ బ్యాంకింగ్‌ యాప్స్‌తో సహా 232 బ్యాంకింగ్‌ యాప్స్‌ను   'ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ9480' అనే ట్రోజన్‌ మాల్‌వేర్‌ టార్గెట్‌ చేసిందని హీల్‌ సెక్యురిటీ ల్యాబ్స్‌  ఇటీవల రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టుల అనంతరం బ్యాంకులు వార్నింగ్‌లు జారీచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మాల్‌వేర్‌ను  'ఆండ్రాయిడ్‌.బ్యాంకర్‌.ఏ2ఎఫ్‌8ఏ' గా బ్యాంకులు పేర్కొంటున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ మాల్‌వేర్‌ పనిచేస్తుందని, ఫేక్‌ నోటిఫికేషన్లను పంపుతుందని, బ్యాంకింగ్‌ అప్లికేషన్లను ఇవి పోలి ఉంటాయని చెప్పాయి. ఒకవేళ వాటిని యూజర్లు ఓపెన్‌ చేస్తే, ఫేక్‌ లాగిన్‌ స్క్రీన్లలోకి మరలి, అటాకర్లు దాడి చేయడానికి, రహస్య సమాచారాన్ని దొంగలించడానికి సహకరిస్తాయని పేర్కొన్నాయి. 

బ్యాంకులు పంపిన మాదిరి ఎస్‌ఎంఎస్‌లు పంపడం, వన్‌-టైమ్‌ పాస్‌వర్డ్‌లు అడగడం వంటివి చేస్తున్నాయని తెలిపాయి. ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే తన కస్టమర్లందర్ని జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. మొబైల్‌ బ్యాంకింగ్‌ వాడేటప్పుడు మంచి విధానాలను పాటించాలని పేర్కొంది. నమ్మకం లేని వర్గాల నుంచి ఏమైనా అప్లికేషన్ల వస్తే వాటిని ఇన్‌స్టాల్‌ చేయొద్దని కూడా సూచిస్తోంది. బ్యాంకింగ్‌ లావాదేవీల కోసం జైల్‌బ్రోకెన్‌, రూటెడ్‌ మొబైల్స్‌ వాడే వారిని కూడా ఈ బ్యాంకు హెచ్చరిస్తోంది. జైల్‌బ్రోకెన్‌ ఐఫోన్లు అధికారిక యాప్‌స్టోర్‌ ద్వారా కాకుండా.. ఈ యాప్స్‌ ఇన్‌స్టాల్‌ అవడానికి అనుమతి ఇస్తున్నాయని తెలిపింది. మరో ప్రైవేట్‌ బ్యాంకు కరూర్‌ వైశ్యా బ్యాంకు కూడా ఇదే మాదిరి సూచనను కస్టమర్లకు జారీచేస్తోంది. మాల్‌వేర్‌ టార్గెట్‌ చేసిన దేశీయ బ్యాంకింగ్‌ యాప్స్‌ జాబితాలో యాక్సిస్‌ మొబైల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ ఎనీవేర్ పర్సనల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మొబైల్‌బ్యాంకింగ్‌ లైఫ్‌, ఐసీఐసీఐ బ్యాంకు ఐమొబైల్‌, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్‌+, ఐడీబీఐ బ్యాంకు లిమిటెడ్‌కు చెందిన అభయ్‌, ఐడీబీఐ బ్యాంకు గో మొబైల్‌, ఐడీబీఐ బ్యాంకు ఎంపాస్‌బుక్‌, బరోడా ఎంపాస్‌బుక్‌, యూనియన్‌ బ్యాంకు మొబైల్‌ బ్యాంకింగ్‌, యూనియన్‌ బ్యాంకు కమర్షియల్‌ క్లయింట్స్‌ ఉన్నట్టు తెలిసింది.  ఈ బ్యాంకింగ్‌ యాప్స్‌ వాడుతున్న కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top