వృద్ధి ఊతానికి అదనపు చర్యలు

వృద్ధి ఊతానికి అదనపు చర్యలు - Sakshi


ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన

ఆర్థిక వ్యవస్థపై ప్రధానితో చర్చలు  




న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అదనపు చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. అలాగే ధరల అదుపునకూ తగిన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోవడం, పారిశ్రామిక ఉత్పత్తి మందగమనం వంటి అంశాల నేపథ్యంలో ఆర్థిక రంగం ప్రస్తుత పరిస్థితి, వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై గడచిన కొద్ది రోజుల నుంచి కొందరు తన సహచర మంత్రులు, ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులతో కీలక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న ఆర్థికమంత్రి, బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిగినట్లు భావిస్తున్న ఈ సమావేశం తరువాత జైట్లీ చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...



ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగానే (ప్లస్‌ 2 లేదా మైనస్‌ 2 శ్రేణి) 4 శాతం వద్ద నిలకడగా ఉంది.  

వర్షాకాల సమయంలో సహజంగానే కూరగాయల ధరలు పెరుగుతాయి. ఇది అటువంటి పెరుగుదల కాలమే. అయినా సాంప్రదాయక భారత ప్రమాణాల ప్రకారం ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.36 శాతం.  

ఆర్థిక పరిస్థితులన్నింటినీ కేంద్రం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వృద్ధికి ఊపునివ్వడం లక్ష్యంగా అవసరమైన చర్యలు ఉంటాయి. అయితే ఇవి ఏమిటన్నది నేను ఇప్పుడే చెప్పలేను. కొన్ని నిర్దిష్ట నిర్ణయాల తర్వాత ఆయా చర్యలు ఏమిటన్నది ప్రధానికి వివరించడం జరుగుతుంది. అటు తర్వాత నిర్ణయాలను మీడియాకు తెలియజేస్తాం.  

పరిస్థితులకు అనుగుణంగా, ఎప్పుడు కావాల్సిన చర్యను అప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంది. తగిన విధంగా సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది.  

పారిశ్రామిక ఉత్పత్తిసహా వివిధ రంగాల పునరుత్తేజానికి తీసుకోవాల్సిన చర్యలపై నేను గడచిన కొద్ది రోజులుగా పలు శాఖల మంత్రులు, అధికారులతో నేను సమగ్ర చర్చలు జరిపాను.



పెట్రోల్, డీజిల్‌పై అధిక పన్నులు తప్పవు...

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలు తగ్గబోవని జైట్లీ బుధవారం సూచించారు. వృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యకలాపాలకు, చేయాల్సిన వ్యయాలకు ప్రభుత్వానికి ఆదాయం అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయాలు లేకపోతే వృద్ధి దెబ్బతింటుందనీ అన్నారు.  2014 నవంబర్‌ నుంచి 2016 జనవరి మధ్య పెట్రోల్‌పై లీటర్‌కు రూ.11.77, డీజిల్‌పై రూ.13.47 చొప్పున ఎౖక్సైజ్‌ సుంకాలు పెరిగిన నేపథ్యంలో వస్తున్న వార్తలను ప్రత్యక్షంగా పేర్కొనకుండా ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. రహదారులు, బ్రిడ్జిల నిర్మాణాల వంటి మౌలిక రంగాల విషయంలో ప్రభుత్వానికి భారీ వ్యయాలు తప్పవని, దీనికి నిధులు సమకూర్చుకోడానికి పన్నులు వేయక తప్పదనీ సూచించారు. ఆయిల్‌ ధరలు త్వరలో స్థిరపడతాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top