దీక్షా ప్రాంగణంలో మిన్నంటుతున్న సమైక్య నినాదాలు | YSR Congress party leader Vijayamma on indefinte hunger strike | Sakshi
Sakshi News home page

దీక్షా ప్రాంగణంలో మిన్నంటుతున్న సమైక్య నినాదాలు

Aug 21 2013 3:33 AM | Updated on Sep 27 2018 5:56 PM

సత్‌సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ‘ సమరదీక్ష’ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపింది. వేల గొంతుకలు ఒక్కటయ్యేలా చేసింది.

సత్‌సంకల్పంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ‘ సమరదీక్ష’ ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపింది. వేల గొంతుకలు ఒక్కటయ్యేలా చేసింది. సమన్యాయంపై ప్రజానీకం విశేషంగా స్పందించేలా చేసింది. సమైక్యాంధ్ర సాధన కోసం సమరోత్సాహాన్ని పాదుకొల్పింది. సమరదీక్ష  రెండవ రోజు మంగళవారం విజయమ్మను చూసేందుకు వచ్చిన సందర్శకులతో దీక్షా శిబిరం కిక్కిరిసింది. ఆమెను పరామర్శించేవారు, సంఘీభావం ప్రకటించేవారు పెరుగుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నినాదాలతో గుంటూరు నగరం మార్మోగుతోంది.
 
 సాక్షి, గుంటూరు : సమైక్యాంధ్ర కోసం కదంతొక్కుతున్న గుంటూరు గడ్డపై వైఎస్ విజయమ్మ సమరదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విజయమ్మ చేపట్టిన సమరదీక్ష ఇటు నాయకులు, అటు ప్రజల్లో సమైక్యస్ఫూర్తిని నింపింది.  కేంద్రం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీడీపీలు అవలంబిస్తోన్న ద్వంద్వ విధానాలను ఎత్తి చూపింది. రాష్ట్ర ప్రయోజనాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా 2008లో చంద్రబాబునాయుడు ప్రణబ్‌ముఖర్జీకి రాసిన లేఖను బహిర్గతం చేశారు.  లేఖ సారాంశాన్ని కరపత్రాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేశారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని జనం పూర్తిగా అర్థం చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన వచ్చినపుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ దాన్ని  తిప్పికొట్టిన వైనాన్ని వేదికపై నుంచి నేతలు తమ ప్రసంగాల్లో వివరించారు.
 
 ఆకట్టుకున్న విజయమ్మ ప్రసంగం...
 దీక్ష ప్రారంభం రోజైన సోమవారం వైఎస్ విజయమ్మ ప్రసంగం ఎంతో మందిని ఆకట్టుకుంది. రాష్ట్ర రాజకీయాలు, భౌగోళిక స్థితిగతులు, సామాజిక వ్యవహారాలతో పాటు రాష్ట్ర విభజన ఎందుకు చేశారో విజయమ్మ తన ప్రసంగంలో వివరించిన తీరు అక్కడ వున్నవారందరినీ అబ్బురపరిచింది. వైఎస్ ఉన్నపుడు రాష్ట్రం ఎలావుంది, లేనపుడు ఎలా తయారైంది అనే విషయాలను వివరిస్తూ, రెండేళ్లుగా వివిధ వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఈక్రమంలోనే ‘సమన్యాయం’ అంటూ విజయమ్మ చేపట్టిన ఉద్యమానికి అర్థం జనానికి బోధపడింది. 
 
 ఇక రెండవ రోజు దీక్షాశిబిరం కిటకిటలాడింది.  కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి పార్టీ నాయకులే కాకుండా సమైక్యవాదులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా దీక్షా శిబిరానికి హాజరై సంఘీభావాన్ని తెలిపారు. వికలాంగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు, నెల్లూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి మహిళలు విచ్చేసి విజయమ్మదీక్షకు సంఘీభావంగా నిలిచారు. గుంటూరు నగరంలోని ముస్లిం మత పెద్దలు  విజయమ్మను నిండుమనసుతో ఆశీర్వదించారు. స్కూలు విద్యార్థులు, వికలాంగులు కూడా స్వచ్చందంగా వేదికపై కొచ్చి విజయమ్మకు మద్దతుగా, సమైక్యవాదాన్ని వినిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement