జిల్లా పరిషత్ పీఠాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందోననే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. జెడ్పీ చైర్మన్ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తలపడుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
జిల్లా పరిషత్ పీఠాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందోననే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. జెడ్పీ చైర్మన్ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ తలపడుతూ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
ఈ పదవి వ్యవహారం తెలుగుదేశం పార్టీలో కీలకనేతల మధ్య విభేదాలు సృష్టించండంతో ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. వైఎస్సార్ సీపీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి అధినాయకత్వం అడుగుజాడల్లో నడుస్తూ పక్కా ప్రణా ళికతో ముందుకు సాగుతున్నారు.
టీడీపీలో చిచ్చు..
జెడ్పీ పీఠం కోసం టీడీపీలో ముగ్గురు నాయకులు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఆ పార్టీ అంతర్గత రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు ఈ పదవిపై గంపెడాశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ సీటు వేరేవారికి ఇస్తున్న నేపథ్యంలో తనకు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఆయన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పార్టీ వెనుకడుగు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ కూడా ఈ పదవి తనకే కావాలని గట్టిగా పట్టుపడుతుండటం, డీసీసీబీ ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చిన అల్లూరి విక్రమాదిత్య కూడా కుర్చీ కోసం సర్వశక్తులూ ఒడ్డుతుండటం ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది.
ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురూ అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరిని కాదన్నా మిగిలిన ఇద్దరూ ఒప్పుకునే పరిస్థితి కనిపించటం లేదు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏకతాటిపై వైఎస్సార్ సీపీ నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకునేం దుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. జెడ్పీ పీఠం ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసేందుకు సిద్ధమని కీలక నేతలు కేంద్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. దీంతో సరైన అభ్యర్థిని అధినాయకత్వమే కొద్దిరోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి.
జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వం సంగతి ఎలా ఉన్నా మండలాల్లో విసృ్తత ప్రచారం చేయడం ద్వారా జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఆదరణే తమ పార్టీని గెలిపిస్తుందని వైసీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జెడ్పీచైర్మన్ అభ్యర్థిని ప్రకటించే పరిస్థితిలో లేదు. 18 మండలాల్లో ఆ పార్టీ తరుఫున అభ్యర్థులే లేకపోవడం గమనార్హం. జెడ్పీఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది.