వేసవి ముప్పు ముంచుకొస్తోంది. జిల్లా అంతటా తాగునీటి కటకట ఇప్పుడే ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగరాలు, పట్టణాల్లోనూ నీటి సరఫరా అరకొరగా సాగుతోంది.
సాక్షి, కరీంనగర్ : వేసవి ముప్పు ముంచుకొస్తోంది. జిల్లా అంతటా తాగునీటి కటకట ఇప్పుడే ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగరాలు, పట్టణాల్లోనూ నీటి సరఫరా అరకొరగా సాగుతోంది. ఇది వేసవిలో మరింత అధ్వానంగా మారే ప్రమాదముంది. జిల్లాలో పూర్తిస్థాయిలో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా చేసిన ప్రతిపాదనలకు సర్కారు ఆమోదం లభించలేదు.
ఎండాకాలంలో ఈ ప్రభావం జిల్లాపై పడనుంది. రూ.930 కోట్ల అంచనా వ్యయంతో ఐదు నెలల కింద సమగ్ర ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రారంభించినా పనిచేయని పథకాల పునరుద్ధరణ, లోపాల నివారణ, తాజా అవసరాల దృష్ట్యా పలు పథకాల విస్తరణ, నిరంతర విద్యుత్ సరఫరా తదితర పనులను ఈ ప్రణాళికలో చేర్చారు. సమగ్ర ప్రణాళికను రూపొందించడం కోసం ప్రజాప్రతినిధులు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తేవాల్సివచ్చింది. అతికష్టమ్మీద అంచనాలను ప్రభుత్వానికి సమర్పించిన నేతలు.. నిధులు సాధించే దిశగా కూడా ఒత్తిడి కొనసాగించాల్సిన ఉంది.
ఒత్తిడితోనే అంచనాలు
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని తరలించేందుకు రూ.3500 కోట్లతో సుజలస్రవంతి పథకాన్ని చేపట్టారు. జిల్లానుంచి ఈ ప్రాంతం మీదుగా నీటిని తరలిస్తూ ఇక్కడి ప్రజలను పట్టించుకోకపోవడం, జిల్లా ప్రజల గొంతు తడపకపోవడాన్ని తప్పుబడుతూ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పలు వేదికల మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత ఏడాది ముఖ్యమంత్రి హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి హుస్నాబాద్ రాగా పొన్నంతో పాటు పలువురు ఈ విషయాన్ని ప్రస్తావించారు. జిల్లా అంతటా తాగునీటి సమస్య పరిష్కారం జరిగేలా ప్రణాళికను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న అన్ని పథకాలను అనుసంధానం చేస్తూ కొత్త స్కీంలను చేరుస్తూ ప్రణాళికను తయారు చేయడంలో అధికారులు జాప్యం చేశారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నాల లక్ష్మయ్య గత సెప్టెంబర్‌లో నిర్వహించిన జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో ప్రభాకర్ తిరిగి ఈ విషయాన్ని లేవత్తారు. ముఖ్యమంత్రి ఆదేశించినా స్పందించని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి లక్ష్మయ్య ఆదేశాలతో అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలను మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు అక్టోబర్‌లోనే గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి జానారెడ్డికి సమర్పించారు. వీలైనంత త్వరగా నిధులు కేటాయించి జిల్లా దాహార్తిని తీర్చాలని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించినా ఫలితం దక్కలేదు.