అప్పుల బాధ, భారీ వర్షాలకు పంట దిగుబడి తగ్గడంతో మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
జగదేవ్‌పూర్/జమ్మికుంట, న్యూస్‌లైన్ : అప్పుల బాధ, భారీ వర్షాలకు పంట దిగుబడి తగ్గడంతో మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీటీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటయ్య(36) తనకున్న రెండెకరాలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మూడేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. పంటల పెట్టుబడి, కుమార్తె వివాహానికి సుమారు రూ. రెండు లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల వర్షాలకు పత్తి పంట పూర్తిగా దెబ్బతింది. అప్పులు తీరే మార్గం కనిపించకపోవడంతో వెంకటయ్య బుధవారం రాత్రి తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. మరోవైపు కరీంనగర్ జిల్లా సిరిసేడు గ్రామానికి చెందిన బీనవేన భాస్కర్ (41 తనకున్న ఎకరంతోపాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాడు. ఇటీవల వర్షాలకు దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.