గోదావరి, కృష్ణా నదులపై ఎగువన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై తాము మెతక వైఖరితో లేమని సీఎం చంద్రబాబు చెప్పారు.
♦ ఆ ప్రభుత్వంతో విభేదాలు లేకుండా ప్రయత్నిస్తున్నా
♦ విస్తరణ జరిగినప్పుడు లోకేశ్‌కు మంత్రి పదవిపై ఆలోచన: సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: గోదావరి, కృష్ణా నదులపై ఎగువన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై తాము మెతక వైఖరితో లేమని సీఎం చంద్రబాబు చెప్పారు. వీటిపై రాష్ట్రానికున్న హక్కులను వదులుకోబోమన్నారు.సోమవారం కేబినెట్ నిర్ణయాలను సీఎం మీడియాకు వివరిస్తున్నప్పుడు ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులనూ పరిశీలిస్తున్నామని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాలు నాలుగింటిని తిరిగి తెలంగాణకు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం చెప్పలేదు.
తెలంగాణ ప్రభుత్వంతో విభేదాలు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నానని, సామరస్యపూర్వక వాతావరణంలో ఇద్దరం (కేసీఆర్, బాబు) కూర్చున్నప్పుడు ఇలాంటి వాటిపై మాట్లాడతామని చెప్పారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు లోకేశ్ మంత్రి పదవి గురించి ఆలోచిద్దామన్నారు. రెండో విడత రుణమాఫీపై వర్కవుట్ చేస్తున్నామన్నారు.