మద్దతు మాటే మరిచారు

There's No Supported Price For Farmers - Sakshi

రోజురోజుకూ పెరుగుతున్న సాగు వ్యయం

నామమాత్రంగా మద్దతు ధర పెంచుతున్న సర్కారు

పెరిగిన ఎరువుల ధరలూ పరిగణనలోకి తీసుకోలేదని రైతాంగం ఆవేదన

క్వింటాకు రూ. 2,800 ఇస్తేనే గిట్టుబాటని స్పష్టీకరణ

భూమి మనదే... కష్టం మనదే... దానిపై పండే పంటకు మద్దతుధర మాత్రం మనది కాదు. ఎక్కడో నాలుగు గోడల మధ్య అధికారులే నిర్ణయిస్తారు. అదైనా క్షేత్రస్థాయిలో అమలవుతుందా అంటే దానికీ లేనిపోని సాంకేతిక కారణాలు చూపి వర్తింపజేయట్లేదు. ఏటా సాగు వ్యయం పెరుగుతోంది. ఎరువులు... విత్తనాలు... పురుగుమందుల ధరలతోపాటు కూలిమొత్తాలూ పెరుగుతున్నాయి. కానీ పండించిన పంటకు ఆ స్థాయిలో ధర నిర్థారించకపోవడమే ఇక్కడున్న సమస్య. ఫలితం ఏటా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతోంది. వారి కష్టం మట్టిపాలవుతోంది.

గరుగుబిల్లి(కురుపాం): దేశానికి రైతే వెన్నెముక అంటారు. వారిని ఆదుకోవడమే తమ ప్రధాన కర్తవ్యం అంటారు. కానీ వారు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించరు. ప్రకృతి విపత్తులవల్లో... మరే కారణాలవల్లో పంట నష్టపోతే కనీసం పరిహారం న్యాయబద్ధంగా అందించరు. అలా రైతు వెన్ను విరిచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి... ఎన్నో సమస్యలకు ఎదురీది... ఎలాగోలా పండించిన పంటకు మద్దతు ధర పెంచాలని వేడుకుంటున్నా సర్కారు మా త్రం చేతులు విదల్చడం లేదు. ఈ ఏడాదైనా మద్దతుధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసే అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది.  క్వింటాలుకు రూ.200లు మాత్రమే పెంచి చేతులు దులుపు కున్నారు.

అమలు కాని ఎన్నికల హామీలు
2014 ఎన్నికల్లో రైతులు పండించే పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా చెల్లిస్తామని తెలు గుదేశం నాయకులు హామీలు గుప్పించారు. వరి పంట ఉత్పత్తి చేసేందుకు క్వింటాలుకు రూ.2వేల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ ప్రభుత్వమే కేవలం రూ.1,770లుగా మద్దతు ధర నిర్ణయించి విశేషం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా రైతుకు క్వింటాలుకు రూ.300వరకు నష్టం వస్తోంది. ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం పెంచడం అటుంచితే పెట్టిన వ్యయం కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. వరికి కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.2,800లు ఉంచాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారు.

’రైతులను పట్టించుకోని ప్రభుత్వం
ధాన్యం మద్దతు« ధరన పెంచాలని రైతులు, సంఘాలుచేసిన పోరాటాలు ప్రభుతాన్ని కదిలించలేకపోతున్నాయి. కంటితుడుపుగా మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వాలు మమ అనిపించాయి. ఎరువుల ధరలను పెంచిన ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ధరలు రెట్టింపు అవడంతో పెట్టుబడులకోసం అధిక వడ్డీలకు అప్పుచేయాల్సి వస్తోంది. ఇంత జరిగినా ప్రకృతి సహకరించకపోతే ఆశించిన దిగుబడి కూడా రావడం లేదు. తీరా వచ్చిన పంటను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు.

దళారీల దందా
ప్రభుత్వం తరఫున సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్థిక అవసరాల నిమిత్తం రైతులు ముందుగా కళ్లాల్లో వాలిపోతున్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ప్రభుత్వ ధరతో నిమిత్తం లేకుండా వారు తమ ఇష్టానుసారం రేటు నిర్ణయించి రైతాంగాన్ని దోచుకుంటున్నారు. పల్లెల్లో సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక సాగు చేయడమంటేనే భయంగా మారి సాగుకు విరామం ప్రకటించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది.

రైతు వ్యతిరేక ప్రభుత్వాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులుగా ముద్రవేసుకున్నాయి. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. వరికి కనీసం రూ.2,500 మద్దతు ధరవుంటే రైతుకు నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు వల్ల తీరని అన్యాయం చేస్తున్నాయి.
– గొట్టాపు త్రినాథస్వామి, కొత్తపల్లి, గరుగుబిల్లి మండలం

కార్పొరేట్లకే రాయితీలు
ఏటా లాభనష్టాలను ఆలోచించకుం డా సాగుచేస్తున్న అన్నదాతలకు వివిధ రకాల సాకులు చూపి కనీస మద్దతు ధర కల్పించని కేంద్రం బ డా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు రకరకాల రాయితీలు కల్పిస్తోంది. కేవలం రైతుల విషయానికి వచ్చేసరికే ఆర్థిక సంక్లిష్టతలను చూపి గొంతు నొక్కేస్తోంది. ప్రభుత్వాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
– కె.రవీంద్ర, సీపీఎం నాయకుడు, గరుగుబిల్లి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top