నిరంతర సమగ్ర మూల్యాంకనంలో (సీసీఈ) భాగంగా పదో తరగతి తరహాలోనే ఈసారి 9వ తరగతిలోనూ 11 పేపర్ల పరీక్ష విధానాన్ని విద్యాశాఖ ప్రవేశ పెట్టింది.
- ఈ వార్షిక పరీక్షల నుంచే అమలు
- ఏప్రిల్ 1 నుంచి 11 వరకు పరీక్షలు
- ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పరీక్షల షెడ్యూలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: నిరంతర సమగ్ర మూల్యాంకనంలో (సీసీఈ) భాగంగా పదో తరగతి తరహాలోనే ఈసారి 9వ తరగతిలోనూ 11 పేపర్ల పరీక్ష విధానాన్ని విద్యాశాఖ ప్రవేశ పెట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే వార్షిక పరీక్షలను కొత్త విధానంలోనే నిర్వహించనున్నారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు నిర్వహిస్తారు.
ఆయా స్కూళ్లలో పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నందున ఈ పరీక్షలను మధ్యాహ్నం నుంచి నిర్వహించనున్నారు. 9, 10 తేదీల్లో జరిగే తొమ్మిదో తరగతి ప్రథమ, తృతీయ భాషల పేపర్-1 పరీక్షలను ఉదయం 8:30 గంటల నుంచి 11:15 గంటల వరకు, ప్రథమ, తృతీయ భాషల పేపరు-2 పరీక్షలను మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:45 గంటలవరకు నిర్వహిస్తారు. (ఒకే రోజు రెండు పరీక్షలు) 11వ తేదీన ద్వితీయ భాష పరీక్ష ఉదయం 8:30 గంటల నుంచి 11:45 గంటల వరకు ఉంటుంది. ఇక ఒకటో తర గతి నుంచి 5వ తరగతి వరకు పరీక్షలు ఉదయం 9:00 గంటల నుంచి 11:30 వరకు జరుగుతాయి. ఈ మేరకు వార్షిక పరీక్షల నిర్వహణ షెడ్యూలును విద్యాశాఖ అన్ని జిల్లాల డీఈఓలకు జారీ చేసింది.
మొదటి రోజు ప్రథమ భాష పరీక్ష కాదు..
ప్రధానంగా 8, 9వ తరగతుల్లో మొదటి రోజు ప్రథమ భాష పరీక్ష నిర్వహించడం లేదు. మొదటి రోజు గణితం పేపరు-1తో పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక ఇందులోనూ పాఠం వెనుక ప్రశ్నలు లేవు కాబట్టి విద్యార్థులు సొంతంగా ఆలోచించి జవాబులు రాయాల్సి ఉంటుంది.
టెన్త్ తరువాతే నిర్వహించాలి: పీఆర్‌టీయూ-టీఎస్
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలను టెన్త్ పరీక్షల తరువాత ఉదయం వేళల్లోనే నిర్వహించాలని పీఆర్‌టీయూ-టీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి పేర్కొన్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు మధాహ్నం పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం సరైంది కాదని అన్నారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్న ఆలోచన సరికాదని, పాఠశాలలు ప్రారంభం అయ్యాక ఆ తరగతులను నిర్వహిస్తే బాగుంటుందన్నారు.