తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కార్మికులకు సముచిత న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు
నాచారం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కార్మికులకు సముచిత న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ శాసనసభ పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. టీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు మారుతీరావుల ఆధ్వర్యంలో సోమవారం నాచారంలో కార్మిక చట్టాల అమలుపై సదస్సును నిర్వహించారు. ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రూప్‌సింగ్, టీఆర్‌ఎస్ ఉప్పల్ ఇన్‌చార్జి బేతి సుభాష్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ నిజాం కాలంలోనే తెలంగాణ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రాంతానికి వచ్చి పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల హక్కులకు, ఉపాధి భద్రతకు హామీ కల్పిస్తామన్నారు. ప్రతి కార్మికునికి ఈఎస్‌ఐ, పీఎఫ్ అందించడంతో పాటు కనీస వేతనాలు రూ.15 వేలు అందించేలా కృషి చేస్తామన్నారు. సదస్సుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అంబర్‌పేట ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి కాచం సత్యనారాయణ, గొల్లూరి అంజయ్య, కుర్మన్న, సోమన్నగౌడ్, డి.శ్రీనివాస్‌గౌడ్, పాండునాయక్, అండాలు తదితరులు పాల్గొన్నారు.