కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పండి | teach lesson to congress,bjp | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పండి

Apr 19 2014 2:45 AM | Updated on Mar 29 2019 9:24 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చక్రవర్తి పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలని విశాలాంధ్ర మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చక్రవర్తి పిలుపునిచ్చారు. అదే సమయంలో స్వయంప్రతిపత్తి కోసం తెలుగు ప్రజల ఉద్యమించాల్సిన అవససరం ఉందన్నారు. శ్రీకాకుళంలోని ప్రైవేటు అతిథి గృహంలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. తెలుగుజాతి ఐక్యత, రాష్ట్ర సమగ్రత పరిరక్షణ కోసం ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విభజనకు వ్యతిరేకంగా విశాలాంధ్ర మహాసభ ఉద్యమించిందన్నారు.
 
విభజనకు అనుకూలంగా 2013 జూలై 30న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర వ్యాప్త సమైక్యతా యాత్ర నిర్వహించామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ పార్టీల కార్యాలయాల ముందు భారీ నిరసనలు చేపట్టినప్పటికీ తెలుగుజాతిని సమైక్యంగా ఉంచడంలో విఫలం చెందామని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు కావడం వల్లే తెలుగుజాతి విచ్ఛిన్నం చెందిందన్నారు.
 
పార్లమెంట్‌లో విభజన బిల్లు ఆమోదం పొందిన తీరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తీవ్ర ఆవేదనను, అవమానానికి గురి చేసిందని, ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజ లంతా తగిన గుణపాఠం నేర్పాలని, ఆ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలన్నారు. రాష్ట్ర విభజనకు అవలంబించిన విధానం దుష్ట సంప్రదాయానికి తెరతీసిందన్నారు. మన రాష్ట్రం ఏడాదికి పన్నుల రూపేణా రూ. లక్షా 20 వేల కోట్లు చెల్లిస్తున్నామని, పన్నులు ఇకపై చెల్లించకుండా ఉండాలంటే మన రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఉండేలా ఉద్యమించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, విదేశీ వ్యవహారాల వంటి మౌలిక పరిపాల నాంశాలకే పరిమితం కావాలన్నారు. సమావేశంలో విశాలాంధ్ర మహాసభ కార్యవర్గ సభ్యులు కె.జగదీష్, మోహన్‌వర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement