
విభజనకు టీడీపీ ఓకే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా గతంలో ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నందున ఇక సీమాంధ్రకు ప్యాకేజీ కోరాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది.
* సీమాంధ్రకు ప్యాకేజీ అడగాలని నిర్ణయం
* ఆ కోణంలోనే అఖిలపక్ష భేటీ కోసం నివేదిక!
* బీజేపీతో బెడిసికొట్టకూడదనే ఢిల్లీ సదస్సుకు చంద్రబాబు దూరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా గతంలో ఇచ్చిన లేఖకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నందున ఇక సీమాంధ్రకు ప్యాకేజీ కోరాలన్న ఆలోచనలో టీడీపీ ఉంది. విభజనను ఏ విధంగా పూర్తి చేయాలన్న అంశంపై కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసే అఖిలపక్ష సమావేశంలో ప్యాకేజీ విషయం ప్రస్తావించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) పరిశీలిస్తున్న అంశాలపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై అఖిలపక్షం నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి షిండే బుధవారం ప్రకటించిన నేపథ్యంలో... తాజా పరిణామాలపై పశ్చిమగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపారు. అఖిలపక్షంలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నట్టుగా లేఖ ఇచ్చిన పార్టీగా ఇక సీమాంధ్రకు ప్యాకేజీపై దృష్టి సారించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సీమాంధ్రలో కొత్త రాజధానికి నాలుగైదు లక్షల కోట్లు కేటాయించాలని చంద్రబాబు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కోణంలోనే నివేదిక సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.
ముందు జాగ్రత్తతోనే చంద్రబాబు దూరం
కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు బుధవారం ఢిల్లీలో నిర్వహిం చిన సదస్సుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కాలేదు. ఈ సదస్సు నిర్వహించాలని సుమారు రెండు నెలలక్రితమే వామపక్షాలతోపాటు భావసారూప్యత కలిగిన పార్టీలు నిర్ణయించాయి. అందులో భాగంగానే సుమారు 20 పార్టీలను ఆహ్వానించాయి. నిర్వాహకులు చంద్రబాబునూ ఆహ్వానించారు. దీనిపై పార్టీ నేతలతో మాట్లాడి చెబుతానన్న చంద్రబాబు ఆ తర్వాత ఎలాంటి సమాచారం పంపలేదు.
ఈ సదస్సుకు ఆహ్వానం అందాక చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి మోడీతో వేదిక పంచుకున్నారు. వచ్చే ఎన్నికలు పార్టీకి చావో రేవో కావటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని లబ్ధి పొందాలని భావిస్తున్న బాబు దృష్టి ఈసారి బీజేపీపై పడింది. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు నిర్వహించే సదస్సుకు హాజరైతే బీజేపీతో సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళనతో ముందుజాగ్రత్తగా సదస్సు నిర్వాహకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యారని టీడీపీ వర్గాలు చెప్పాయి.