ఘనంగా వీరారాధన ఉత్సవాలు ప్రారంభం | Strong admirer of grand celebrations begin | Sakshi
Sakshi News home page

ఘనంగా వీరారాధన ఉత్సవాలు ప్రారంభం

Nov 22 2014 1:46 AM | Updated on Sep 2 2017 4:52 PM

ఘనంగా వీరారాధన ఉత్సవాలు ప్రారంభం

ఘనంగా వీరారాధన ఉత్సవాలు ప్రారంభం

పల్నాటి వీరారాధన ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో వున్న వీరాచార, వీరవిద్యావంతులు కారంపూడి చేరుకుంటున్నారు.

కారంపూడి చేరుకుంటున్న వీరాచార, వీరవిద్యావంతులు

కారంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో వున్న వీరాచార, వీరవిద్యావంతులు కారంపూడి చేరుకుంటున్నారు. సుమారు 35 కొణతాలు ఉత్సవ నిధి మీదకు వచ్చాయి. తమ వెంట తెచ్చుకున్న వంశపారంపర్యంగా వస్తున్న ఆయుధాలను వీరులగుడిలో వుంచారు. తర్వాత వాటిని బయటకుతీసి నాగులేరు గంగధారి మడుగులో శుభ్రపరచారు. వీరతాళ్లు, వీర్ల అంకమ్మ పెట్టెలోని వస్తువులనూ శుభ్రంచేశారు.

వీరులగుడి పూజారులు ఆయుధాలకు పసుపు పూసి పూజకట్టారు. వీరులగుడి ఆవరణలో ఆయుధాలకు అలంకారాలు చేశారు. ఆయుధాలతో ఊరేగింపుగా అంకాళమ్మ తల్లి, చెన్నకేశవస్వాములను దర్శించుకుని అక్కడ తీర్థం తీసుకున్నారు. తర్వాత పీఠాధిపతి పిడుగు తరుణ్‌చెన్నకేశవ ఇంటికి వెళ్లి ఆయన వెంట వీరులగుడికి చేరుకున్నారు. అక్కడ పీఠాధిపతి వీరులగుడి ముఖద్వారంపై ఎర్రజెండాను ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభించారు.

వీరులగుడిలో వున్నపోతురాజుకు పెద్ద అన్నంముద్దను పూజారి సమర్పించారు. ఆనాడు బ్రహ్మనాయుడు శివనందుల కోట ఆక్రమణకు వెళ్లినప్పుడు అడ్డు వచ్చిన పోతురాజుకు మేకపోతును, పెద్దముద్దను ఇచ్చి సంతృప్తి పరచాడని, అదేవిధంగా ఆ సన్నివేశాన్ని స్మరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. వాస్తవానికి  జీవంమెడను నోటితో కొరికి పోతురాజుకు సమర్పించే ప్రక్రియను రాచగావు అంటారు. ప్రభుత్వ నిషేధం కారణంగా అన్నంముద్దను సమర్పిస్తున్నారు.

తర్వాత పీఠాధిపతి హాజరైన వీరాచార, వీరవిద్యావంతులందరికీ ముంజేతి కంకణాలు కట్టారు. ఆచారవంతులు పీఠాధిపతికి నమస్కరించారు. పీఠాధిపతి సమక్షంలో కథాగానాలు కొనసాగేందుకు అఖండ జ్యోతిని వెలిగించారు. గుంటూరుకు చెందిన పోతురాజు యేగయ్య రాచగావు కథాగానం ఆలపించారు. పల్నాటి వీరారాధనోత్సవాల్లో రెండో రోజు రాయబారం ఉత్సవం జరుగుతుంది.

వీరాచారం మాకు ప్రాణప్రదం.. నాకిప్పుడు 75 సంవత్సరాలు. ఉహ తెలిసినప్పటి నుంచి తండ్రి నర్సయ్య వెంట ఉత్సవాలకు వస్తున్నా. ఆయన మృతి తర్వాత కథలు చెప్పే బాధ్యత చేపట్టాను. చిన్నప్పటి నుంచి వీరుల కథ చెప్పడానికి నాన్న తర్పీదునిచ్చాడు. మా పూర్వీకులంతా వీరాచారంపైనే ఆధారపడ్డాం. వీరాచారవంతులు విద్యావంతులైన వమ్ములను గౌరవిస్తారు. వారి ఇళ్లలో మంచైనా చెడైనా చె ప్పడానికి శుభకార్యాలు మా సలహా ప్రకారం చేసుకుంటారు. వీరాచారం మా ప్రాణం లాంటిది.
 -పోతురాజు యేగయ్య, వీరవిద్యావంతుడు, గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement