ఆ చట్టం..నిందితుల చుట్టం!

Station Bails In Prakasam - Sakshi

ప్రకాశం, చీరాల రూరల్‌: ఎలాంటి కేసులన్నా మాకేం లెక్కలేదు.. కర్రలు, కత్తులతో దాడి చేస్తాం.. ఎంతకైనా తెగిస్తాం.. ఏమైనా చేస్తాం...అవసరమైతే లేపేసేస్తాం.. పోలీసుస్టేషన్‌లో ఎంతైనా పడేసి దర్జాగా ఇంటికెళ్లిపోతాం.. ఇదీ.. ప్రస్తుతం పోలీసుస్టేషన్ల వద్ద నిందితుల తీరు. ఇదేమిటి ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు..దీనికి కారణం ఏమై ఉంటుందని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనంతటికి ఓ సెక్షన్‌ నిందితులకు చుట్టంగా మారింది.

సీఆర్సీసీ సెక్షన్‌ 14 (ఏ)
సీఆర్పీసీ సెక్షన్‌ 41 (ఏ) నోటీసు ప్రస్తుతం నిందితులకు వరంగా మారింది. ఈ నోటీసు సారాంశం ఏమంటే ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసులన్నింటికీ పోలీసుస్టేషన్‌లో పోలీసులే స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వవచ్చనమాట. ఈ 41 (ఏ) నోటీసు చట్టం రెండేళ్లకుపైగా పోలీసు స్టేషన్లలో అమలులో ఉంది.

గతంలో అయితే..
గతంలో ఇళ్ల వద్ద చిన్నచిన్న గొడవలు జరిగినా.. ఎవరినైనా చంపుతామని బెదిరించినా.. ఒకరిని కర్రలతో కొట్టినా.. బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి కేసులు పెడితే పోలీసులు కేసు నమోదుచేసి దాడికి పాల్పడిన నిందితులపై కేసులు నమోదు చేసి వెంటనే కోర్టులో హాజరు పరుస్తారు. ఆ కేసు బెయిల్‌ ఇవ్వదగినదని న్యాయమూర్తి భావిస్తే నిందితునిగా ఉన్న వ్యక్తికి తక్షణమే బెయిలు పొందే సౌకర్యం ఉంటుంది. ఇక్కడ బాధితుడు కొంత వరకు ఉపశమనం పొందుతాడు. తనను కొట్టిన వ్యక్తి కోర్టు వరకు వెళ్లాడని సంతోషపడతాడు. నిందితుడు కూడా కోర్టులో అందరూ తనను ఒక దోషిలా చూశారని కుమిలిపోతాడు. బెయిల్‌ ఇవ్వదగిన కేసయితే నిందితుని తరఫున ఇద్దరు జామీను (ఆస్తి పూచీకత్తు) దారులు కోర్టులో హాజరై నిందితుడు తనకు తెలుసునని జామీనుదారులుగా ఉండి ఆ మేరకు న్యాయమూర్తికి విన్నవించుకోవాల్సి ఉంటుంది. అప్పుడు న్యాయమూర్తి నిందితునికి బెయిల్‌ మంజూరు చేస్తారు. దీని వలన బాధితుడు కొంత వరకు తనకు న్యాయం జరిగిందని, నిందితునికి తగిన శాస్తి జరిగిందని ఆనందపడతాడు. కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తికి కూడా డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. కోర్టులన్నా.. పోలీసు స్టేషన్లన్నా కొంత వరకు భయపడే అవకాశం ఉంటుంది.

పెద్ద కేసులకు రిమాండ్‌ తప్పదు
ఏడేళ్లలోపు కేసులన్నింటికీ పోలీసుస్టేషన్లలో బెయిల్‌ పొందే సౌకర్యాన్ని సెక్షన్‌ 41 (ఏ) కల్పిస్తోంది. ఏడేళ్లు అంతకంటే పైబడిన కేసుల్లోని నిందితులను మాత్రం పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఏడేళ్లకు పైబడిన కేసులంటే ఉదాహరణకు 307, 376, 326, 353, 354 సెక్షన్‌లు కలిగిన కేసులన్నమాట. వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కత్తి లేదా ఇతర ఇనుప లోహంతో తయారు చేసిన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడటం, మహిళను రేప్‌ చేసేందుకు ప్రయత్నించడం, విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు సక్రమంగా చేయకుండా అటంక పరచడం, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడే దొంగలకు సంబంధించిన కేసులన్న మాట.

జిల్లా వ్యాప్తంగా..
జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా వేలాది కేసులు ఆయా పోలీసుస్టేషన్లలో నమోదవుతుంటాయి. వాటిల్లో ఏడేళ్లలోపు కేసులే అధికంగా ఉంటాయి. వాటిల్లో భార్యాభర్తల కేసులు 498 (ఏ) కేసులు, కొట్లాట కేసులు కూడా ఉంటాయి. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి స్టేషన్‌లోనే సీర్పీపీసీ 41 (ఏ) సెక్షన్‌ కింద పోలీసులు నోటీసు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఇద్దరు పెద్ద మనుషులు తమ ఆధార్‌ కార్డులు జిరాక్స్‌లతో పోలీసుస్టేషన్‌కు వచ్చి నిందితునికి జామీనుగా ఉంటామని పోలీసులకు తెలియజేసి ఆధార్‌ కార్డు జిరాక్స్‌లు సమర్పించాల్సి ఉంటుంది.

రూ.5 నుంచి 20 వేలకుపై మాటే
ఇటువంటి కేసుల్లో నిందితులు పోలీసుస్టేషన్లలో 41 (ఏ) నోటీసు బెయిల్‌ పొందాలంటే ఆయా పోలీసుస్టేషన్లలో డబ్బులు దండిగా ముట్టచెప్పాల్సిందే. ఆయా కేసుల తీవ్రతను బట్టి నిందితుని వద్ద ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. ఒక్కో కేసులో సుమారుగా రూ. 5 వేల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయా కేసుల్లో నిందితునికి నోటీసు ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే విషయం ఆయా స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓపై ఆధారపడి ఉంటుంది. నిందితుడు డబ్బులు సరిగా ముట్టచెప్పని పక్షంలో అతనిపై రిమాండ్‌ రిపోర్టులో అదనంగా ఆరోపణలు రాసి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా మొత్తం ఇదే ట్రెండ్‌ నడుస్తుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

న్యాయవాదులకు తగ్గిన ప్రాక్టీస్‌
ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు 41 (ఏ) నోటీసు (బెయిల్‌) పొందే అవకాశం పోలీసుస్టేసన్లు కల్పించడంతో క్రిమినల్‌ సైడ్‌ ప్రాక్టీసు చేసే న్యాయవాదులకు ప్రాక్టీసు తగ్గిపోయింది. ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు గొడవ జరిగిన కొద్ది రోజుల్లోనే బాధితుల మందు దర్జాగా ఇద్దరు పెద్ద మనుషులను స్టేషన్‌కు తీసుకొచ్చి స్టేషన్‌లో సంతకాలు చేసి ఇంటికి వెళ్తున్నారు. అదే మామూలు రోజుల్లో అయితే ఏ చిన్న గొడవ జరిగినా ముందుగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తారు. కోర్టులో హాజరు పరిచేంత వరకు నిందితుడు పోలీసుల అదుపులో ఉంటాడు. ప్రస్తుతం అమలులో ఉన్న నోటీసులతో నిందితులు చాలా సులభంగా స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లిపోతున్నారు. అదే నిందితుడిని కోర్టులో హాజరు పరిస్తే ఇద్దరు జామీనుదారులతో కోర్టుకు హాజరై బెయిల్‌ పొందేందుకు ముందుగా న్యాయవాదిని కలవాల్సి ఉంటుంది.  ఎంతోకొంత ముందుగా న్యాయవాదికి ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. 41 (ఏ) నోటీసు ద్వారా నిందితుడికి ఇవన్నీ తప్పాయి. అన్నింటి కంటే ముఖ్యంగా బాధితునికి కనీస న్యాయం జరగడం లేదు.

సీఆర్పీసీ సెక్షన్‌ 41 (ఏ) రద్దు కోరుతున్న న్యాయవాదులు
న్యాయవాదుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన 41 (ఏ) నోటీసు రద్దు చేయాలని న్యాయవాదులు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాను కోరుతున్నారు. ఇటీవల జరిగిన బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏపీ ఎన్నికల్లో కౌన్సిల్‌ సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు తాము గెలిస్తే 41 (ఏ) రద్దు చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ముద్రించి ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top