తప్పులపై తర్జనభర్జన

State govt in troubles with Polavaram Project irregularities - Sakshi

     పోలవరంలో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం కలవరపాటు

     ప్రతిపాదనల్లో తప్పులను బయటపెట్టిన కేంద్ర మంత్రి గడ్కరీ 

     సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్లే తప్పులు దొర్లాయంటున్న అధికార వర్గాలు 

     టీడీపీ నేతల అక్రమాల వల్ల ముంపునకు గురయ్యే భూమి రెట్టింపు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో(డీపీఆర్‌–2) తప్పులను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బహిర్గతం చేసి, వాటికి వివరణ కోరడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. తాను లేవనెత్తిన అంశాలపై ఎనిమిది రోజుల్లోగా సాక్ష్యాధా రాలతో సహా వివరణ ఇవ్వాలని గడ్కరీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర సర్కారు కిందా మీదా పడుతోంది. సేకరించాల్సిన భూమి విస్తీర్ణంతో పాటు పనుల పరిమాణాన్ని పెంచేయడంపై వివరణ ఇచ్చేందుకు తర్జనభర్జన పడుతోంది. అవాస్తవాలను చూపితే కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేసే అవకాశం ఉండడంతో జలవనరుల శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

సీఎం చంద్రబాబు ఉలికిపాటు 
పోలవరం ప్రాజెక్టు పనులను నితిన్‌ గడ్కరీ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడే సమీక్షా సమావేశం నిర్వహించారు. డీపీఆర్‌–2లోని తప్పులపై విస్మయం వ్యక్తం చేశారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెరగకపోయినా ముంపునకు గురయ్యే భూమిని రెట్టింపు చేయడం.. పనుల పరిమాణాన్ని పెంచేయడంతోపాటు ఎడమ, కుడి కాలువ అంచనా వ్యయాలను 2015–16 ధరల ఆధారంగా సవరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టారు. వాటి కంటే 2013–14 ధరల ఆధారంగా తయారు చేసిన డీపీఆర్‌–2లో అంచనా వ్యయాలు అధికంగా ఉండడంపై గడ్కరీ నిలదీయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉలిక్కిపాటుకు గురైనట్లు తెలిసింది. 

గడ్కరీ సంధించిన ప్రశ్నాస్త్రాలు 
- పోలవరం జలాశయంలో 57,432.21 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని.. దాన్ని సేకరిస్తే సరిపోతుందని 2010–11 ధరల ప్రకారం రూపొందించిన అంచనాల్లో పేర్కొన్నారు. కానీ 2013–14 ధరల ఆధారంగా సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో 1,05,539.89 ఎకరాల భూమి ముంపుకు గురువుతుందని వెల్లడించారు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెరగలేదు. అలాంటప్పుడు ముంపునకు గురయ్యే భూమి ఎలా పెరిగింది? 
- ముంపు గ్రామాల్లో 2014 తర్వాత కూడా ప్రభుత్వ భూములకు పట్టాలు జారీ చేశారు? జలాశయం పనులకు 2004లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పుడు.. ముంపు గ్రామాల్లో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వడం తప్పు కాదా? ఇప్పుడు ఆ భూములకు పరిహారం ఇవ్వడం వల్ల ఖజానాపై భారం పడదా? 
- పోలవరం జలాశయం పనుల్లో జనవరి వరకూ 1,055 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 34.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది. కానీ, ఆ తర్వాత మట్టి పనుల పరిమాణం 1,115.59 లక్షల క్యూబిక్‌ మీటర్లకు, కాంక్రీట్‌ పనుల పరిమాణం 36.79 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పెరిగింది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెరగనప్పుడు చేయాల్సిన పనుల పరిమాణం ఎలా పెరిగింది? 
- 2015–16 ధరల ఆధారంగా పోలవరం ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.3,645.15 కోట్లకు, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,375.77 కోట్లకు సవరిస్తూ 2016 డిసెంబర్‌ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013–14 ధరల ఆధారంగా సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలలో ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,644.13 కోట్లుగా, కుడి కాలువ అంచనా వ్యయాన్ని రూ.4,476.96 కోట్లుగా చూపారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 నాటి ధరలు తక్కువగా ఉండాలి. అంటే అంచనా వ్యయం తగ్గకపోగా పెరగడంలో ఔచిత్యం ఏమిటి? 
- 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం రూ.46,925.96 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్‌ 22న నిర్ధారించింది. 2017 ఆగస్టు 17న రూ.58,319.06 కోట్లుగా చూపిస్తూ కేంద్ర జలసంఘానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్ర జలసంఘం అనుమానాలు వ్యక్తం చేస్తే.. అంచనా వ్యయాన్ని రూ.57,940.86 కోట్లకు తగ్గిస్తూ ఈ ఏడాది మే 1న మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ఒక్కోసారి ఒక్కోవిధంగా అంచనా వ్యయాన్ని చూపించడంలో ఆంతర్యమేమిటి? 

కమీషన్ల కక్కుర్తి వల్లే...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను పట్టుబట్టి సాధించుకునే వరకూ అంటే 2016 సెప్టెంబరు 7 దాకా జలాశయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదు. ఆ తర్వాత పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి సీఎం చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2013లో రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ విధానం ప్రకారం చేసుకున్న కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండానే.. గత జనవరిలో స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ పనులను నవయుగ సంస్థకు ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ విధానంలో అప్పగించారు. కమీషన్లు దండుకునే క్రమంలో మట్టి, కాంక్రీట్‌ పనుల పరిమాణాన్ని పెంచేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీనివల్ల మట్టి పనుల పరిమాణం 60.50 లక్షల క్యూబిక్‌ మీటర్లు, కాంక్రీట్‌ పనుల పరిమాణం 2.75 లక్షల క్యూబిక్‌ మీటర్లు పెంచేసినట్లు అధికారులు చెబుతున్నారు. కుడి కాలువలో మిగిలిన పనులను ముఖ్యనేత తన కోటరీలోని కాంట్రాక్టర్‌కు నామినేషన్‌పై అప్పగించారు.

ఎడమ కాలువ పనుల్లో ఆరో ప్యాకేజీ మినహా మిగిలిన పనులను పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్‌పై కట్టబెట్టారు. ఆ తర్వాత 2015–16 ధరల ప్రకారం కుడి, ఎడమ కాలువల అంచనా వ్యయాన్ని పెంచేస్తూ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చడం ద్వారా కమీషన్లు రాబట్టుకోవాలన్న ఎత్తుగడలో భాగంగానే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. 2013–14 ధరల ఆధారంగా డీపీఆర్‌–2ను తయారుచేసే సమయంలో 2015–16 ధరల ఆధారంగా అంచనా వ్యయాన్ని పెంచేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సర్కార్‌ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయినట్లు జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు చెప్పారు. భూసేకరణ చట్టం–2013 ప్రకారం పరిహారం ఇవ్వనున్న నేపథ్యంలో.. ముంపు గ్రామాల్లో అధికార టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. వాటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోవడం వల్లే సేకరించాల్సిన భూమి విస్తీర్ణం రెట్టింపు అయ్యిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమయ్యాకే సమావేశం 
పోలవరం ప్రాజెక్టు పనులకు 2010–11 ధరల ప్రకారం అంటే డీపీఆర్‌–1 ప్రకారం రూ.431.27 కోట్లు మాత్రమే కేంద్ర బకాయిపడింది. ఈ నిధులు విడుదల చేయాలని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. డీపీఆర్‌–2పై కేంద్రం ఆమోదముద్ర వేస్తేనే ఆ మేరకు నిధుల విడుదలకు ఆస్కారం ఉంటుంది. కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాల మేరకు డీపీఆర్‌–2పై కేంద్ర జలసంఘం అధికారులు మూడు రోజులపాటు సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశం ఎప్పుడు నిర్వహించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధతపై ఆధారపడి ఉందని అధికారులు అంటున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top