కేంద్ర కారాగారానికి శ్రీనివాస్‌ | Sakshi
Sakshi News home page

సుదీర్ఘంగా నిందితుడి విచారణ

Published Sat, Oct 27 2018 9:05 AM

Sribnivas Shifted To Central prison Visakhapatnam - Sakshi

సాక్షి,విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును విశాఖ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఘటన జరిగిన అనంతరం గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని నగరంలోని ఎయిర్‌పోర్టు లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అప్పట్నుంచి శుక్రవారం సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచారు. జగన్‌పై హత్యాయత్నం ఘటనపై కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు ఉన్నతాధికారులు రహస్యంగా విచారణ కొనసాగించారు. విశాఖ నగర æపోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా స్వయంగా నిందితుడు శ్రీనివాస్‌ను విచారించారు.

మరోవైపు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ వద్ద పోలీసులను భారీ మొహరించారు. అప్పటికప్పుడు స్టేషన్‌ వెలుపల గోడలకు సీసీ కెమెరాలను కూడా అమర్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో నిందితుడిని ఉంచడం, న్యాయ నిపుణులు, పోలీసు ఉన్నతాధికారులు రాకపోకలతో హడావుడి నెలకొంది. హైడ్రామా హంగామా నడిచింది.

మీడియా కళ్లుగప్పే ప్రయత్నం
నిందితుడు శ్రీనివాసరావును ఎయిర్‌పోర్టు లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారన్న సమాచారం తెలుసుకుని మీడియా ప్రతినిధులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పోలీస్‌ కమిషనర్‌ మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో నిందితుడిని అప్పటికే సిద్ధం చేసిన వ్యాన్‌లో మీడియా కళ్లుగప్పి తరలించారు. నిందితుడు శ్రీనివాసరావును వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తీసుకెళ్తున్నట్టు పోలీసు అధికారులు చెప్పారు. కానీ కేజీహెచ్‌కు కాకుండా విమానాశ్రయానికి తీసుకెళ్లారు.  అక్కడి నుంచి కేజీహెచ్‌కు... అనంతరం మూడో మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి రమ్య ఎదుట ఆమె నివాసంలో నిందితుడు శ్రీనివాసరావును హాజరు పరిచారు. శ్రీనివాసరావుకు జడ్జి నవంబర్‌ 9వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు.

కేంద్ర కారాగారానికి  శ్రీనివాస్‌
ఆరిలోవ(విశాఖ తూర్పు): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావును పోలీసులు శుక్రవారం రాత్రి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. శ్రీనివాస్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు కారాగారానికి హైసె క్యూరిటీతో తరలించారు. శ్రీనివాసరావుని అందరిలాగే సాధారణమైన ఖైదీగానే ఉం చుతూ తోటి ఖైదీలతో కలవనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. 

Advertisement
Advertisement