
పోలీస్ వలయంలో తిరునగరం
శ్రీవారి దర్శనానికి శ్రీలంక అధ్యక్షులు మహీంద రాజపక్స మంగళవారం సాయంత్రం తిరుమలకు వచ్చిన నేపథ్యంలో తిరుపతి, తిరుమలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
శ్రీవారి దర్శనానికి శ్రీలంక అధ్యక్షులు మహీంద రాజపక్స మంగళవారం సాయంత్రం తిరుమలకు వచ్చిన నేపథ్యంలో తిరుపతి, తిరుమలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిఘాను పటిష్టం చేసి.. భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజపక్సకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి వచ్చిన ద్రవిడ పార్టీలు ఎండీఎంకే, వీసీకే నేతలు, కార్యకర్తలు, తమిళ సంఘాల ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడంతో భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
* తిరుపతి, తిరుమలలో భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు.. జిల్లావ్యాప్తంగా ఆంక్షలు
* 500 మందికి పైగా తమిళులను అదుపులోకి తీసుకున్నారన్న ప్రజాసంఘాలు.. లేదన్న ఎస్పీ
* తిరుపతిలో రాజపక్సకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఎండీఎంకే, వీసీకే నేతలు, తమిళ సంఘాలు
* నేడు శ్రీవారిని దర్శించుకుని శ్రీలంక వెళ్లనున్న రాజపక్స.. బుధవారం మధ్యాహ్నం వరకూ ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి క్రైం: ఎల్‌టీటీఈ, తమిళులపై శ్రీలంకలో అధ్యక్షులు మహీంద రాజపక్స సైన్యా న్ని ఉసిగొల్పి దాడులు చేయించారని ద్రవిడ పార్టీలు, ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. రాజపక్సకు వ్యతిరేకంగా రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి 9న శ్రీవారి దర్శనం కోసం వచ్చిన రాజపక్సను తిరుపతిలో తమి ళ సంఘాలు, ద్రవిడ పార్టీలు అడ్డుకోవడానికి విఫలయత్నం చేశాయి.
ఆయన శ్రీవారి దర్శనం కోసం మంగళవారం తిరుమలకు వస్తున్నట్లు పక్షం రోజుల క్రితం ఆ దేశ ప్రభుత్వం కేం ద్రానికి వర్తమానం పంపింది. రాజ పక్స పర్యటన నేపథ్యంలో ద్రవిడపార్టీలు, ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని ఐబీ(ఇంటెలిజెన్స్ బ్యూరో) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే తిరుపతి, తిరుమల, చిత్తూరు-తమిళనాడు సరిహద్దులపై పోలీసులు నిఘా వేశారు. భారీ ఎత్తున బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. తమిళనాడు నుంచి జిల్లాకు ఉన్న రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి.. వాహనాలను తనిఖీ చేసి, అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. శేషాచలం అడవులతో పాటూ తిరుమల ఘాట్ రోడ్లను జల్లెడ పట్టారు.
అడగడుగునా తనిఖీలు..
మంగళవారం ఉదయం నుంచే తమిళనాడు నుంచి వచ్చే రైళ్లు, వాహనాలను పోలీసులు భారీ ఎత్తున తనిఖీ చేశారు. తిరుపతి అలిపిరి టోల్‌గేట్, శ్రీవారి మెట్టు, శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు వెళ్లే నడకదారిలోనూ పో లీసులు తనిఖీ చేశారు. తిరుపతి-చెన్నై రహదారిపై తడుకుపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు భారీ ఎత్తున నాకాబందీ నిర్వహించారు. శ్రీపెరంబదూర్ ఎండీఎంకే అధ్యక్షులు కన్నన్ నేతృత్వంలో తిరుపతికి వస్తున్న ఆ పార్టీ కార్యకర్తలను తడుకుపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో 500 మంది ఎండీఎంకే, వీసీకే కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇందులో రేణిగుంట వద్ద ఎండీఎంకే నేత కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో అంబేద్కర్ సర్కిల్ వద్ద రా జపక్సకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వీసీకే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్‌జే.విద్యాసాగర్, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకు ని తిరుచానూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు.
తిరుపతిలోని బేరివీధిలో 70మంది తమిళులను అదుపులోకి తీ సుకుని తిరుచానూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి చేరుకున్న ద్రవిడపార్టీల నేతలు, కార్యకర్తల కోసం తిరుమల, తిరుపతిలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 500 మందికిపైగా తమిళులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తే.. కేవలం 95 మందినే అరెస్టు చేశామని ఎస్పీ గోపీనాథ్ జట్టి ప్రకటించారు.
భద్రత కట్టుదిట్టం..
తమిళుల నిరసన జ్వాలల మధ్య సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి మహీంద రాజపక్స రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి రాజపక్సకు అక్కడ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రెండు ప్రత్యేక హెలీకాప్టర్లలో రాజపక్స కుటుంబ సభ్యులు తిరుపతిలోని తారకరామ స్టేడియం చేరుకున్నారు.
మంత్రి బొజ్జల స్వాగతం పలికారు. ఈ సందర్భంలోనే అంబేద్కర్ సర్కిల్, బేరివీధిలో తమిళులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించడం గమనార్హం. తారకరామ స్టేడియం నుంచి చెర్లోపల్లి క్రాస్, ఎస్వీ జూపార్క్ మీదుగా అలిపిరి టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. రెండో ఘాట్ రోడ్డు మీదుగా సాయంత్రం 5.30 గంటలకు తిరుమలకు చేరుకున్న రాజపక్సకు మంత్రి బొజ్జల, కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు.
రాత్రికి పద్మావతి అతిథిగృహంలో బస చేసి.. బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో శ్రీలంకకు బయలుదేరి వెళ్లనున్నారు. రాజపక్స తిరుపతి నుంచి బయలుదేరి వెళ్లే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి.