
రాజపక్స రాకతో.. తిరుమలలో ఉత్కంఠ
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స తిరుమల పర్యటన అత్యంత ఉత్కంఠంగా సాగింది.
* అడుగడుగునా టీటీడీ ఆంక్షలు
* దుకాణాల మూసివేత.. భద్రతా బలగాల సోదాలు
సాక్షి, తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స తిరుమల పర్యటన అత్యంత ఉత్కంఠంగా సాగింది. ఆయనను అడ్డుకుంటామని తమిళనాడుకు చెందిన పలు రాజకీయ పార్టీలు హెచ్చరించాయి. దీంతోపాటు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాజపక్స ప్రయాణించే కాన్వాయ్ ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేశారు. ఆ ప్రాంతంలో అదనపు భద్ర తా బలగాలను మోహరించారు. సోమవారం నుంచే నిర్వహించిన కాటేజీల తనిఖీలు మంగళవారం కూడా కొనసాగా యి. తమిళనాడు చిరునామాతో పొందిన గదులు, అతిథిగృహాలను పరిశీలించారు. అనుమానిత వ్యక్తుల బ్యాగులను సోదా చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
గత ఏడాది సుమారు 100 మందిని తిరుమలలోనే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అనుమానితులను తరలిం చేందుకు ముందస్తుగానే మూడు ఆర్టీసీ బస్సులు సిద్ధం చేశారు. నిరసన తెలిపేందుకు అనుమానితులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకొస్తే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి గోగర్భం డ్యాం వద్ద ఓ మఠంలో నిర్బంధించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ సారి రెండు కాన్వాయ్‌లు ఏర్పాటు చేశారు. రాజపక్స తిరుమల పర్యటన మినిట్ టూ మినిట్ కార్యక్రమాలను అప్పటికప్పుడే మార్పులు చేసేలా ఏర్పాట్లు చేశారు.
గతంలో కంటే ఈసారి పద్మావతి అతిథిగృహాలను ఇతర భక్తులకు కేటాయించకుండా దాదాపుగా ఖాళీగా ఉంచారు. ఆ ప్రాంతంలో ఇతర వ్యక్తులను కూడా తిరగనివ్వలేదు. సమీప ప్రాంతంలోని అన్ని అతిథి గృహాల మేడలపై బందోబస్తు పోలీసుల పహారా ఉంచారు. రాజపక్స బస చేసి న ప్రాంతంలో జామర్లు ఏర్పాటు చేశారు. రాజపక్స పర్యటనను చిత్రీకరించేందుకు మీడియాను కూడా చాలా దూరంలోనే ఉంచారు. ముందస్తుగానే అన్ని చోట్లా బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు తనిఖీ చేశారు. రాత్రి 10 గం టల తర్వాత అన్ని ప్రాంతాల్లోని దుకాణాలను మూసివేయాలని పోలీసు అధికారులు దుకాణదారులకు ఆదేశాలిచ్చారు.
రాజపక్స శ్రీవారి దర్శన ఏర్పాట్లపై జేఈవో ప్రత్యేక శ్రద్ధ
అంతర్జాతీయ భద్రత కలిగిన శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు వేంకటేశ్వర స్వామివారి దర్శన ఏర్పాట్లపై జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎక్కడా చిన్నపాటి లోపం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. రాజపక్స బస చేసిన శ్రీకృష్ణ అతిథిగృహంలోని వసతి సౌకర్యాలను కూడా జేఈవో పరిశీలించారు.
తర్వాత సాయంత్రం 5.35 గంటలకు రాజపక్స తిరుమలకు చేరుకున్నాక కూడా రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీలంక నుంచి వచ్చిన ప్రతినిధులు ఎన్నిగంటలకు రావాలి? అధ్యక్షుడు ఎన్ని గంటలకు రావాలి? మినిట్ టూ మినిట్ కార్యక్రమాలను ఖరారు చేశారు. ఆ మేరకు ఆలయం, వైకుంఠం అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలిచ్చి అప్రమత్తంగా ఉండాలని ఆయా విభాగాలను హెచ్చరించారు.