తేనెకన్నా తీయనిది తెలుగు భాష

Special Story On Telugu Language Day - Sakshi

నేడు తెలుగు భాషా దినోత్సవం 

వేమన పద్యం చేదైపోయింది. సుమతీ శతకాలు బరువైపోయాయి. సుభాషితాలు పిల్లల నోటికి అందడం లేదు. పెద్దబాలశిక్ష శిక్షగా మారిపోయింది. వేల ఏళ్లు ఛందస్సులు, యతి ప్రాసలతో వర్ధిల్లిన భాష ఇప్పుడు ఏటికేటా పదాలు కోల్పోతూ పరభాషల ముందు తలవంచుకు కూర్చుంది. నేడు తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి గుర్తుగా వేడుక చేసుకునే రోజు. వేడుక మాత్రమే కాదు ఈ రోజు వేదిక కావాలి. పవర్‌ రేంజర్స్‌ బదులు పంచతంత్ర కథలు పిల్లలకు కంఠతా రావడానికి ఈ రోజు వేదిక కావాలి. మన పద్యం మళ్లీ గత వైభవం సంతరించుకునేందుకు ఇదే రోజు అంకురార్పణ జరగాలి.

సాక్షి, ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) : అమ్మతో కష్టసుఖాలు చెప్పుకునే భాష నోటికి బరువైపోతోంది. కొత్త పదాల సృష్టి కరువైపోతోంది. ఒకప్పుడు ఆకాశ మార్గాన ఉన్న భాషను నేలకు దించి సాహిత్యాన్ని సామాన్యులకు చేరదీసిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి నేడు. భాష కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. వేడుకలు బాగానే ఉన్నాయి గానీ ఏ ఉద్దేశంతోనైతే గిడుగు పోరాటం చేశారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదు. వెన్న కన్నా మెత్తనైన తెలుగు భాష వర్తమానంలో పతనావస్థ అంచులపై వేలాడుతోంది. తెలుగు వెలుగులు మసక బారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉంది. తెలుగు భాషకు పట్టాభిషేకం చేసి వైభవ ప్రాభావాలతో కళకళలాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థులు–ఉపాధ్యాయులు సంయుక్తంగా వైభవంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరిపేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. 

తెలుగు కోసం ప్రభుత్వం ముందడుగు
తెలుగు భాష మృత భాషగా మారుతోంది అన్న మాట వచ్చినప్పటి నుంచి పాఠశాలల్లోనూ తెలుగు భాషను సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మండలం లో ఉన్న ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలసికట్టుగా మం డల విద్యాశాఖాధికారి ఎంపిక చేసిన పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరపాలని ఆదేశించింది. ఈ సందర్భంగా వేమన, సుమతీ శతకాలు వంటి పద్యధారణ, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్యపోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అం దించి, విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచేందుకు కృషి చేయాలని నిర్ణయించింది. 

గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి.. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి. శ్రీకా>కుళానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న జన్మించిన రామమూర్తి తండ్రి వీర్రాజు, తల్లి వెంకటమ్మ. 1877 వరకూ ప్రాథమిక విద్య అక్కడే కొనసాగింది. ఆ తర్వాత తండ్రికి చోడవరం బదిలీ కాగా.. అక్కడే ఆయన కన్నుమూశారు. గిడుగు మేనమామ ఇంట్లో ఉంటూనే మహారాజా వారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలోనే గడిపారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావుకు సహాధ్యాయి. 

సవర భాష రూపశిల్పి
అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది గిడుకు రామమూర్తికి. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్‌ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర – ఇంగ్లిష్‌ కోశాన్ని నిర్మించాడు. మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి కైజర్‌ –ఇ– హింద్‌ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంధికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు.

బోధన భాషగా తెలుగు
తెలుగు భాష వ్యవహారంలో మాత్రం దూరమైపోతోంది. కనీసం పదో తరగతి వరకూ బోధన జరపాలని కృషి చేశాం. కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు లేకపోవడం దురదృష్టకరం. తెలుగు నేర్చుకుంటే అన్ని భాషలు వస్తాయి. మాతృభాషలో ప్రవేశం తప్పనిసరిగా ఉండాలి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారి మాతృభాషను బోధన భాషగా చేయాలి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అధికార భాషా సంఘాధ్యక్షునిగా పదవీ స్వీకరించిన నేపధ్యంలో ఇకపై తెలుగు బాగా వెలుగుతుందని ఆశిద్దాం.
– డాక్టర్‌ ఎ.గోపాలరావు, అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు

అమ్మభాషను పరిరక్షించుకుందాం
తెలుగు లోగిళ్లలో అమ్మభాషను పరిరక్షించుకోవడం మన కర్తవ్యం. మాతృభాషను తృణీకరించడమంటే మన కళ్లను మనమే పొడుచుకోవడం వంటిది. భవిష్యత్‌ తరాల నోట మకరందాల తేనె ఊట ఊరాలి. తెలుగును నిలబెట్టుకోవడమంటే మన జాతి ఘన వారసత్వ సంస్కృతి, మూలధనాన్ని పరిరక్షించుకోవడమేనని నా ఉద్దేశం. తెలుగు వెలుగులు విరజిమ్మాలి. మనమంతా ఆ దిశగా కృషి చేయాలి.
– సముద్రాల గురుప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ సమితి 

దేశ భాషలందు తెలుగు లెస్స
ఏ భాషలోనూ లేనన్ని అక్షరాలు, మరే భాషలోను లేనట్టి అవధాన ప్రక్రియలు కలిగిన మధురమైన భాష తెలుగు. ఆంగ్ల మాధ్యమంపై వ్యామోహంతో అమ్మ భాషను నిర్లక్ష్యం చేయకూడదు. కన్నతల్లి మాతృభూమి, మాతృభాష ఎల్లప్పుడూ పూజలందుకోవాలి. అలా జరగాలంటే బాల్యం నుంచే పిల్లలకు తెలుగు పద్యాలు, కథలు, సామెతలు, పొడుపు కథలు చెప్పి మాతృభాష మీద మమకారం పెంచాలి. అమ్మ భాషలోని కమ్మదనం అలవాటు చేస్తే మధురమైన తెలుగు భాషపై ఇష్టం పెంచుకుని తరువాతి కాలానికి వాళ్లే తీసుకెళ్తారు. రాష్ట్రంలో తెలుగు అమలుకు కొన్ని చర్యలు చేపట్టాలి. అధికార ఉత్తర, ప్రత్యుత్తరాలు, న్యాయస్థానాల తీర్పులు, వ్యాపార, వాణిజ్య సంస్థల పేర్లు, చలన చిత్రాల పేర్లు, వీధులు, కూడళ్ల పేర్లను తెలుగులోనే రాయాలని పొరుగు రాష్ట్రమైన తమిళనాడులా నిర్బంధ ఉత్వర్వులు జారీ చేయాలి. జారీ చేసిన ఉత్వర్వుల అమలుకు సరైన పర్యవేక్షణ చేయిస్తూ లోపాలు సరిదిద్దితే భాష మనుగుడ సులభతరం అవుతుంది.    
– నారంశెట్టి ఉమామహేశ్వరరావు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత, పార్వతీపురం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top