
రుణమాఫీలో అనేక సందేహాలు: స్పీకర్ కోడెల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు రుణమాఫీలో అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పీకర్ కోడెల అన్నారు.
రుణమాఫీపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు నెల్లూరులో వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు రుణమాఫీలో అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పీకర్ కోడెల అన్నారు. ఇంకా ఈ అంశంపై బ్యాంకర్లు, రైతులు, అధికారులలో స్పష్టత రాలేదని ఆయన అన్నారు. రుణమాఫీ అన్న తర్వాత రైతులు రుణాలు కట్టడం మానేశారని, దీంతో వడ్డీ భారం పెరిగిపోయిందని కోడెల చెప్పారు. రూ. 50 వేల లోపు రుణాలు మాఫీ చేయాలని అంటున్నా, వాటిమీద వడ్డీ పెరిగిపోవడంతో ఏం చేయాలన్న విషయమై బ్యాంకర్లలోను.. రైతులలో కూడా అస్పష్టత ఉందని, దీన్ని వెంటనే నివృత్తి చేయాలని సూచించారు.
నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన స్పీకర్ కోడెల.. జిల్లాలోని టీడీపీ సీనియర్ నాయకుడైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ మీడియా కలిసినప్పుడు.. ఈ వ్యాఖ్యలు చేశారు. 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐదు అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని, వాటిలో రుణమాఫీ, రాజధాని నిర్మాణం, పారిశ్రామికాభివృద్ధి ముఖ్యమైనవని ఆయన అన్నారు.