పాము మృతిపై బుస్సుమన్న ‘దుర్గాడ’

Snake Suspicious death In Durgada East Godavari - Sakshi

అనుమానాస్పదంగా పాము మృతి

ఎస్సై చంపించారంటూ జాతీయ రహదారిపై ఏడు గంటలపాటు బైఠాయింపు

ఎస్పీ ఆదేశంతో డీఎస్పీ ఘటనాస్థలికి రాక

విధుల నుంచి ఎస్సై తొలగింపు

పాము కనిపిస్తే ... బడితను తీసుకొని వీరోచితంగా దబా,దబా బాది చంపేస్తే...ఆ క్షణంలో ఆ వ్యక్తి హీరో. కానీ ఈ ఘటనలో పాపం ఆ ఎస్సై బాధితుడిగా మారి గ్రామస్తుల ఆగ్రహానికి గురయ్యారు. మేం పూజించే పామును చంపే హక్కు ఆ ఎస్సైకి ఎక్కడిదంటూ జాతీయ రహదారిపై ముళ్ల కంపలు వేసి ఏకంగా ఏడు గంటలపాటు రాస్తారోకో చేయడంతో ఎస్సై విధుల నుంచి తప్పుకోవల్సి వచ్చింది. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఘటనా స్థలికి వచ్చి ఆందోళనకారులను శాంతింపజేయాల్సి వచ్చింది.

తూర్పుగోదావరి ,గొల్లప్రోలు (పిఠాపురం): సుబ్రహ్మణ్యేశ్వరుడిగా భావించి 26 రోజులుగా పూజిస్తున్న తాచుపాము గురువారం అనుమానాస్పదంగా మృతి చెందడంతో..దుర్గాడ గ్రామస్తులు గురువారం హైవేపై ఆందోళనకు దిగడంతో రాత్రి వరకు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం 10 గంటల వరకు దర్శనమిచ్చిన ఆ పాము సుమారు 11 గంటల సమయంలో మృతి చెందింది. ఎస్సై బి.శివకృష్ణ అక్కడి నుంచి వెళ్లిన కొంత సేపట్లో మృతి చెందిందని ఎస్సైతో పాటు వచ్చిన ఒక వ్యక్తి పాము వద్ద రుమాలు వంటి వస్త్రాన్ని వేసి వెళ్లాడని, వస్త్రం వద్దకు చేరిన పాము కొద్దిసేపట్లో మృతి చెందినట్టు గ్రామస్తులు గుర్తించారు. మంత్రసానిని తీసుకువచ్చి వస్త్రంపై మందు వేసి పామును చంపినట్టు గ్రామస్తులు అనుమానించారు. దీంతో ఎస్సై శివకృష్ణ చంపించారని వారు ఆందోళనకు దిగారు.

దుర్గాడ నుంచే ఇరుపొరుగు గ్రామస్తులు వేలాదిగా దుర్గాడ జంక్షన్‌లోని 216 జాతీయ రహదారి దిగ్బంధించి ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి. రాత్రి గ్రామస్తులు రోడ్డుపై మంటను వేసి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌ను చెందుర్తి, తాటిపర్తి సెంటర్‌ మీదుగా మళ్లించారు. పిఠాపురం సీఐ అప్పారావు, తహసీల్దార్‌ వై.జయ వారితో పలుసార్లు చర్చించారు. ఎస్సైను గ్రామానికి తీసు కు రావాలని పట్టుబట్టారు. వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు, నాయకులు కొప్పన మో హనరావు, మొగలి బాబ్జీ, బుర్రా అనుబాబు, అరవ వెంకటాద్రి తదితరులు ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని నాయకుల సమక్షంలో గ్రామస్తులతో మాట్లాడారు. ఎస్సై పై కేసు నమోదు చేశామని, గొల్లప్రోలు స్టేషన్‌ విధుల నుంచి తొలగించామని డీఎస్పీ చెప్పారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన పాము మృతికి కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

రోదించిన గ్రామస్తులు
రోజూ పూజిస్తున్న పాము మృతి చెందడంతో పాము కళేబరాన్ని పట్టుకుని గ్రామస్తులు రోదించా రు. పట్టుకున్నా పాము ఏమీ చేసేది కాదన్నారు. పాము కళేబరాన్ని పల్లకిపై ఊరేగింపుగా స్థానిక శివాలయంలో ఉంచి రాత్రి అంతా భక్తులు భజన చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top