నాగన్నకు కన్నీటి వీడ్కోలు

Snake Funeral Complete In Durgada Village East Godavari - Sakshi

శాస్త్రోక్తంగా ఖననం భారీ ఎత్తున ఊరేగింపు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సన్నాహాలు

తూర్పుగోదావరి , గొల్లప్రోలు: మండలంలోని దుర్గాడ గ్రామంలో పూజలు అందుకుంటున్న తాచుపాము మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 26రోజులుగా ప్రత్యక్షదైవంగా భావించిన సర్పం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. ఈ మేరకు గ్రామస్తులు, సమీప గ్రామాల నుంచి వచ్చిన భక్తులు సర్పానికి కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక శివాలయం నుంచి పామును పల్లకిపై ఉంచి మేళతాళాలతో ఊరేగించారు. దారిపొడవునా భక్తులు పూలు, పసుపు నీళ్లతో అభిషేకించారు. గ్రామస్తుడు ఆకుల వీరబాబు పొలంలో ఉంచి పూజలు చేశారు. పండితులు శాస్త్రోక్తంగా పూజాధి కార్యక్రమాలు నిర్వహించి, ఖననం చేశారు.

భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు
కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పాము ఖననం జరిగిన ప్రదేశంలో పసుపు, కుంకుమ, విభూది చల్లి పూజలు చేశారు. మహిళలు భజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పన మోహనరావు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. పూజలు నిర్వహించారు. ఆయన వెంట మల్లాం సర్పంచి కొప్పన శివానాథ్‌ తదితరులు ఉన్నారు.

తాచుపామును పల్లకిపై ఊరేగిస్తున్న భక్తులు 
దొరబాబు రూ.లక్ష విరాళం

పాము ఖననం చేసిన ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి భక్తులు, గ్రామస్తులు సన్నాహాలు చేపట్టారు. స్థలదాత ఆకుల జోగిరాజు కుమారుడు వీరబాబు అనుమతితో పనులు ప్రారంభించారు. వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం అందజేశారు.  ఆయన వెంట మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మొగలి బాబ్జీ, వైఎస్సార్‌సీపీ నాయకులు మొగలి అయ్యారావు, ఆకుల శ్రీను, వెలుగుల సత్యనారాయణ, కోటి తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top