సమైక్యవాదినని చెప్పకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో బస్సుయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను విమర్శించారు.
సమైక్యవాదినని చెప్పకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో బస్సుయాత్ర చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను విమర్శించారు. చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాతే సీమాంధ్రలోయాత్రలు చేయాలని డిమాండ్ చేశారు. రేపు సాయంత్రం అవనిగడ్డ, ఎల్లుండి ఉదయం కైకలూరులో షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్ర ఉంటుందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాలూ ఆందోళనలోకి రావాలని అంతకుముందు ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాగు, తాగు నీరు విషయంలో సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగితే డెల్టా శాశ్వతంగా బీడుబారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాగుకు కూడా నీరు లేక ప్రజలు మొత్తం వలసపోవల్సి వస్తుందన్నారు. ఫలితంగా జల యుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే అన్నివర్గాల వారూ ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు.