ఆశలు సమాధి చేస్తూ..

Rroad Accident Student funeral In Guntur district  - Sakshi

నూతన సంవత్సర వేళ కొంగొత్త ఆశల రెక్కలు కట్టుకుని ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆశించిన బిడ్డలు.. విగతజీవులయ్యారు. ఇక వీడ్కోలంటూ గత స్మృతుల్లో కలిసిపోయిన కాలంలో వారూ సమిధలయ్యారు. తమ భవిష్యత్‌పై తల్లిదండ్రులు కట్టుకున్న ఆకాంక్షల కోటలను నిలువునా కూల్చేసి కళ్ల ముందు కట్టెలుగా మిగిలారు. సోమవారం గుంటూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన విద్యార్థుల అంత్యక్రియలు మంగళవారం వారి స్వగ్రామాల్లో నిర్వహించారు. ఆయా ఊళ్లన్నీ కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో కన్నీటి ఏరులయ్యాయి. శోకతప్త హృదయాలతో అందరి గుండెలు బరువెక్కాయి.

గుంటూరు జిల్లా /పిడుగురాళ్ల: నూతన సంవత్సర వేడుకల వేళ విద్యార్థుల నిండు జీవితాలు బలవడానికి కారణం కళాశాల యాజమాన్యమేనని తల్లిదండ్రులు, ముస్లిం నాయకుడు పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్‌ గఫూర్‌(18) మృతికి కళాశాల యాజమాన్యం స్పందించాలంటూ మంగళవారం పోలీస్‌స్టేషన్‌ వద్ద ధర్నా చేపట్టారు. సోమవారం గుంటూరు రూరల్‌ మండలం లాలుపురం వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.. వీరిలో గఫూర్‌ కూడా ఉన్నారు. ధర్నాలో ముస్లిం మైనార్టీ నాయకుడు లతీఫ్‌ మాట్లాడుతూ విద్యార్థులు బయటికి వెళ్లేటప్పుడు కళాశాల యాజమాన్యానికి తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇది వారి బాధ్యతారాహిత్యమేనని పేర్కొన్నారు. ఐదుగురు విద్యార్థులు చనిపోయినా కనీసం స్పందించకపోవడమేమిటని మండిపడ్డారు.  అనంతరం ఎస్‌ఐ నారాయణస్వామి వచ్చి ప్రమాదం జరిగిన గుంటూరులో నిరసన తెలపాలని, కళాశాల యాజమాన్యంతో మాట్లాడేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నూర్జాన్‌ బాషా అధ్యక్షుడు షేక్‌ అంజాసాహెబ్‌ఎండీ జబ్బార్, ఎండీ గఫార్, ఖయూమ్, హోటల్‌ కరిముల్లా, అబ్దుల్‌ కరీమ్, మస్తాన్‌వలి, కారు డ్రైవర్ల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు. 

బాధితులను ఫోన్‌లో పరామర్శించిన కాసు
మృతుడు గఫూర్‌ తండ్రి బాలసైదాను వైఎస్సార్‌ సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించి ప్రగాఢ సతాపం తెలిపారు. మంగళవారం గఫూర్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

తుమ్మలకుంటలో..
తుమ్మలకుంట (శావల్యాపురం): మండలంలోని కొత్తలూరు పంచాయతీ శివారు తుమ్మలకుంట గ్రామానికి చెందిన బీటెక్‌ విద్యార్థి గుంటూరు కోటేశ్వరరావు (19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మంగళవారం మృతుడు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి తండ్రి సాంబశివరావు మాజీ సర్పంచి కావటంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి వైఎస్సార్‌ సీసీ నియోజకవర్గ నియోజకవర్గ బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, డీసీసీ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు నివాళులర్పించారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంపీడీవో జీ చంద్రశేఖర్, రిటైర్డ్‌ ఎంపీడీవో నూతలపాటి విజయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

కంభంపాడులో..
కంభంపాడు(పెదకూరపాడు): రోడ్డు ప్రమందంలో మృతి చెందిన చిరుమామిళ్ల సాయిరామ్‌ మృతదేహానికి స్వగ్రామమైన కంభంపాడులో మంగళవారం కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో బంధువులు, స్నేహితులతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు రమేష్, గంగాదేవిలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. సాయిరామ్‌ మృతదేహానికిఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ«ధర్‌ నివాళులర్పించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top