పురుగులుపట్టిన గోధుమలు, గోధుమపిండి.. ఘాటులేని కారంపొడి.. ఇవీ అమ్మహస్తం సరుకులు. నాణ్యత పూర్తిగా కొరవడిన ఈ సరుకులను తీసుకునేందుకు తెల్లకార్డుదారులు ముఖం చాటేస్తున్నారు.
ముక్కిపోయిన కందిపప్పు.. గింజల చింతపండు..
పురుగులుపట్టిన గోధుమలు, గోధుమపిండి.. ఘాటులేని కారంపొడి.. ఇవీ అమ్మహస్తం సరుకులు. నాణ్యత పూర్తిగా కొరవడిన ఈ సరుకులను తీసుకునేందుకు తెల్లకార్డుదారులు ముఖం చాటేస్తున్నారు. పథకం ప్రారంభించి ఆరు నెలలు గడుస్తోంది. ప్రభుత్వం రాయితీపై ఇచ్చే సరుకులు తీసుకునే వారు నెలనెలకు పెరగాల్సి ఉంది. నాణ్యత లేకపోవడం, మార్కెట్ ధరల స్థాయిలోనే సబ్సిడీ ధరలు ఉండడంతో తీసుకునేవారు క్రమంగా తగ్గిపోతున్నారు. నిత్యావసరాలను సబ్సిడీపై ఇస్తుంటే ముందుకువచ్చి కొనాల్సిన పేదలు ఈ సరుకులు అంటేనే దూరంపోతున్నారు.
- సాక్షి ప్రతినిధి, కరీంనగర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఎప్పటికప్పుడు ఎగబాకుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేదలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం సబ్సిడీపై తొమ్మిది సరుకులు ఇచ్చేలా అమ్మహస్తం పథకం ప్రవేశపెట్టింది. జిల్లాకు సంబంధించి ఏప్రిల్ 27న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గం ముల్కనూరులో అమ్మహస్తం పథకాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ సరుకులు ఆలస్యంగా పంపిణీ చేశారు. దీంతో మొదటి నెలలో పంపిణీ తీరు గాడితప్పింది. అమ్మహస్తం పథకం కింద కిలో చొప్పున కందిపప్పు, గోధుమపిండి, గోధుమలు, ఉప్పు, అరకిలో చొప్పున చక్కెర, చింతపండు, పావు కిలో కారంపొడి, లీటరు పామాయిల్, వంద గ్రాముల పసుపును ప్యాకెట్లలో ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సరుకులన్నింటికీ రూ.185గా ధర ఖరారు చేసింది.
బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలను బట్టి మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా భరించేలా పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితో పథకం అమలు గాడితప్పింది. ప్రస్తుతం జిల్లాలో 10,11,792 బీపీఎల్ కార్డులు ఉన్నాయి. తొమ్మిది సరుకుల్లో ఇంతే సంఖ్యలో ప్యాకెట్లు రావాలి. అందరికీ పంపిణీ చేయాలి. నాణ్యతసరిగా లేకపోవడంతో సరుకులు తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ఫలితంగా ఏ నెలలోనూ సరుకుల పంపిణీ శాతం 50 శాతం కూడా చేరుకోలేదు. పథకం అమలు కోసం ప్రతినెల తొమ్మిది రకాల సరుకులు 10,11,792 చొప్పున ప్యాకెట్లు పంపిణీ చేయాల్సి ఉండగా... మేలో పౌరసరఫరాల సంస్థ 91,00,640 ప్యాకెట్లు కేటాయింది. కేవలం 9,76,828 ప్యాకెట్లు మాత్రమే పేదలకు చేరాయి. ఆ తర్వాత ఆగస్టులో 35 లక్షల ప్యాకెట్లు పంపిణీ అయ్యాయి. ఆరు నెలల తర్వాత ఇది పెరగాల్సి ఉండగా... అక్టోబరులో ఇప్పటికి 18 లక్షల ప్యాకెట్లే పంపిణీ అయ్యాయి.
అయోమయం...
అమ్మహస్తం పథకం సరుకుల నాణ్యతపై విమర్శలు ఆగడం లేదు. ముక్కిపోయిన కందిపప్పు, గింజల చింతపండు, పురుగుల మయమైన గోధుమలు, గోధుమపిండి, ఘాటులేని కారంపొడి ప్యాకెట్లను తీసుకునేందుకు పేదలు ఆసక్తిచూపడం లేదు. అమ్మహస్తంలో తొమ్మిది సరుకులు ఉన్నా వినియోగదారులు మూడు సరుకులనే తీసుకుంటున్నారు.
అమ్మహస్తంకు ముందు పంపిణీ చేసే చక్కెర, పామాయిల్, గోధుమలనే రేషన్ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇచ్చేది మూడు సరుకులే కావడంతో అమ్మహస్తం కింద ఒక్కో కార్డుపై ఇచ్చే సబ్సిడీ 7.78 మాత్రమే ఉంటోంది. నెలకు సగటున ఉప్పుపై 91 పైసలు, కారంపై రూ.3.75, చింతపండుపై రూ.4.25 సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోంది. పసుపుకు సంబంధించి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధర కంటే రూ.1.13 అధిక రేటుతో విక్రయిస్తోంది. పసుపుపై ప్రభుత్వానికి మిగులుతున్న మొత్తాన్ని మినహాయిస్తే ఒక్కోకార్డుదారుపై నెలకు భరించే సబ్సిడీ రూ.7.78 మాత్రమే అని స్పష్టమవుతోంది.