గోదావరిలో పుష్కర స్నానమాచరించేందుకు జిల్లా నుంచి వెళ్లిన భక్తులు మంగళవారం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో
విజయనగరం కంటోన్మెంట్: గోదావరిలో పుష్కర స్నానమాచరించేందుకు జిల్లా నుంచి వెళ్లిన భక్తులు మంగళవారం పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందడం బాధాకరమని కలెక్టర్ ఎంఎం నాయక్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ తొక్కిసలాటలో మృతి చెందిన బాడంగి మండలం పాల్తేరు గ్రామానికి చెందిన అమలాపురం పైడితల్లి(56), కొత్తవలస మండలం తుమ్మికాపల్లి గ్రామానికి చెందిన ఆరిపాక నారాయణమ్మ(54)ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని బుధవారం అందజేస్తామని తెలిపారు.
విజయనగరం పట్టణంలోని కోరాడవీధికి చెందిన కోచ్చెర్లపాటి సత్యవతి (62) అనే మహిళ కూడా మృతి చెందినట్టు సమాచారం అందిందని, విచారణ జరిపి ఆమె కుటుంబానికి కూడా పరిహారం అందిస్తామని చెప్పారు. పుష్కరఘాట్ వద్ద గాయపడి రాజమండ్రిలో చికిత్స పొందుతున్నవారికి జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. డీఆర్‌డీఏ పీడీ ఢిల్లీ రావు అక్కడ ఉండి క్షతగాత్రులకు అవసరమైన సహకారం అందిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. బొబ్బిలి తహశీల్దార్ మసిలామణిని కూడా రాజమండ్రి పంపినట్టు కలెక్టర్ తెలిపారు.