ప్రైవేటు .. ఫీజులుం | private...fees | Sakshi
Sakshi News home page

ప్రైవేటు .. ఫీజులుం

May 24 2014 1:51 AM | Updated on Jul 26 2019 6:25 PM

ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇటు ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు కత్తిమీదసాముగా మారింది.

సాక్షి, కడప:  ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇటు ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు కత్తిమీదసాముగా మారింది. మరో పది రోజుల్లో  ప్రైవేటు పాఠశాలలు...ఆపై మరో వారం రోజులకు  సర్కారు పాఠశాలలు  పునఃప్రారంభం కానున్నాయి, ఈ క్రమంలో ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులు రంగు రంగుల కరపత్రాలు పట్టకుని రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. చాలా పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవు.
 
 కొన్ని పాఠశాలలకు గుర్తింపు లేదు. ఒలంపియాడ్, ఐఐటీ, టెక్నో, కాన్సెప్ట్, ఈ టె క్నో, ఈ కాన్వెంట్, పబ్లిక్ స్కూలు, వంటి పేర్లను గతేడాది తొలగించారు. పేర్లు మారినా ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలను చేర్పించడంపై టీచర్లకు కూడా ‘ప్రైవేటు’యాజమాన్యాలు టార్గెట్ విధించా యి. ఒక్కో టీచరు కనీసం పదిమంది విద్యార్థులనైనా చేర్పించాలని హుకుం జారీ చేశాయి. ఎక్కువ మందిని చేర్పిస్తే వేతనాలు కూడా సంతృప్తికరంగా ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఏం మాట్లాడినా ఓపికతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
 భారీగా ఫీజులు
 విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. కానీ జిల్లాలో ఏ యాజమాన్యాలు దీన్ని పట్టించుకోవడం లేదు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు. విద్యాబోధనతో పాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీషు, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్, ఇతర టాలెంట్ టెస్టులను నిర్వహిస్తున్నామంటూ పలు  రకాల ఫీజుల పేరుతో భారీగా వసూళ్లు చేస్తున్నారు.
 
 వీటికి తోడు పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు టై అంటూ ఇష్టమొచ్చిన ధరలను యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా వారి వద్దనే తీసుకోవాలంటూ  నిబంధన  విధిస్తున్నారు. ఎల్‌కేజీ విద్యార్థికే ఏడాదికి 30వేల రూపాయలు ఖర్చవుతోంది. 5-10 తరగతి వరకైతే స్కూళ్లను బట్టి 50 వేల నుంచి-లక్ష రూపాయల వరకూ ఖర్చవుతోంది. వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నా,  కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు.
 
 నిబంధనలకు విరుద్ధం:
 విద్యాహక్కు చట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు. కానీ చాలాస్కూళ్లు దీన్ని పాటించడం లేదు. విద్యార్థులకు ప్రవేశపరీక్ష(ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహించి అందులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికే అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు చిన్న వయస్సులోనే మానసికంగా కుంగిపోయి చదువుపై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు.
 
 ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. దీనితోడు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న చాలా పాఠశాలలు డిగ్రీ, ఇంటర్ చదివిన వారితోనే బోధన సాగిస్తున్నారు. కరపత్రాల్లో మాత్రం ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తున్నారు. పైగా అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా ప్రైవేటు స్కూళ్లు వెలుస్తున్నా చర్యలు ఉండటం లేదు.
 
 సర్కారు టీచర్లకు తిప్పలు
  ప్రైవేటు పాఠశాలల వారు ఇంటింటికి వచ్చి గద్దల్లా పిల్లలను ఎగరేసుకుపోవడం, ప్రైవేటు వేగాన్ని ప్రభుత్వాధికారులు అందుకోకపోవడంతో ఏటేటా సర్కారు స్కూళ్లలో పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. జిల్లాలో ఒక్క విద్యార్థి కూడా లేనివి 23, పది మంది లోపు విద్యార్థులున్నవి 37 పాఠశాలలు ఉన్నాయి. ఏకోపాధ్యాయులతో నడిచే స్కూళ్లు 137 ఉన్నాయి. ఇలా మొత్తం  198 పాఠశాలల్లో పిల్లలు లేరనే కారణంతో గతేడాది 132 పాఠశాలలు మూసేశారు. ఈ ఏడాది మరో 66 పాఠశాలలు మూసివేతకు గురయ్యే ప్రమాదముంది.ఇలాంటి ప్రమాదకర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. పైగా రాష్ట్రవిభజన నేపథ్యంలో ఈ ఏడాది ‘బడిబాట’ నిర్వహణ కూడా డౌటే. ఈ నేపథ్యంలో సర్కారు బడులు నిలవాలంటే స్కూలుకు పదిమందికి తక్కువ లేకుండా పిల్లలను చేర్పించుకోవాల్సిన అనివార్య పరిస్థితి. లేదంటే సర్కారు బడుల మనుగడ ప్రశ్నార్థకమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement