
ప్రోత్సాహమేదీ?
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కొరవడింది. పరిశ్రమలు స్థాపించాలనే ఔత్సాహికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.
జిల్లాలో పరిశ్రమలస్థాపనకు ప్రోత్సాహం కొరవడింది.
పరిశ్రమలు స్థాపించాలనే ఔత్సాహికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది.
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్:
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కొరవడింది. పరిశ్రమలు స్థాపించాలనే ఔత్సాహికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వ విధానాల వల్ల అరకొరగా ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. ఫలితంగా కార్మికులకు ఉపాధి కరువవుతోంది. ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు వలసబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. పరిశ్రమల స్థాపనకు స్థానికంగా ఉన్న వనరులను గుర్తించి ఔత్సాహికులను ప్రోత్సాహించడంలో జిల్లా యంత్రాంగం విఫలమవుతోంది. మొత్తం జిల్లాలో 40 వేలకు పైగా వివిధ రకాల కార్మికులున్నారు.
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు కొదవలేదు. ఒక్క జిల్లా ఉపాధి కార్యాలయంలోనే 56 వేలకుపైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారమే జిల్లాలో మధ్యతరహా, చిన్న తరహా, గ్రామీణ , ఖాదీ పరిశ్రమలకు * 18 నుంచి *20 వేల కోట్ల వరకు పెట్టుబడి అవసరమవుతోంది. చిన్నతరహా యూనిట్ల నమోదులోనూ వెనుకబడి ఉంది. గుళ్లాపల్లి వద్ద పారిశ్రామికవాడల్లో ప్లాట్ల కేటాయింపులకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు వస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలుస్తోంది.
అవగాహన కల్పించడంలో విఫలం:
పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహికులకు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు కూడా నామమాత్రమే. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఈ ఏడాది ఇంతవరకు ఔత్సాహికులకు అవగాహన నిర్వహించలేదంటే అర్థం చేసుకోవచ్చు.
మార్కాపురం, కందుకూరు, చీరాల ప్రాంతాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కేవలం 120 మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు కావడంతో వీరంతా పరిశ్రమలు పెట్టేవరకు నమ్మకం లేని పరిస్థితి. రుణాల మంజూరులో బ్యాంకులు మొకాలడ్డుతుండటంతో కొత్త పరిశ్రమల స్థాపన గగనమవుతోంది. ఇక ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 2010-15 ఇండస్ట్రియల్ పాలసీ కింద నాలుగేళ్లలో ఎస్సీ నిరుద్యోగులు 18 మంది, ఎస్టీలకు ఒకరికి మాత్రమే రుణ పరపతి కలిగింది.
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద 2012-13 ఆర్థిక సంవత్సరంలో 59 యూనిట్లు మంజూరైతే కేవలం 40 మందికి మాత్రమే యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పీఎంఈజీపీ కిందే 76 యూనిట్ల లక్ష్యం కాగా కేవలం 31 యూనిట్లకే బ్యాంకులు రుణం మంజూరు చేసేందుకు మొగ్గు చూపాయి. అదీ లబ్ధిదారులు పూర్తి స్థాయిలో హామీలిస్తేనే రుణం చేతికందుతుంది. లేదంటే హుళక్కే. వీటితో పాటు ఎల్‌అండ్‌ఎం ఎంటర్ ప్రైజెస్, మైక్రో అండ్ స్మాల్ యూనిట్లు కూడా నిరుద్యోగులకు అందని ద్రాక్షే అవుతోంది. ఇంకా వేగవంతంగా, సులభతరంగా వివిధ శాఖల అనుమతులు పొందేందుకు ఉద్దేశించి ప్రారంభించిన సింగిల్ విండో పథకం ఆశించిన స్థాయిలో అనుమతులు అందటం లేదనే చెప్పాలి.
జిల్లాలో ఉన్న 71 భారీ, మధ్యతరహా పరిశ్రమలు, 335 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు అంతంత మాత్రంగానే నడుస్తున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామికవాడల్లో నీటి సమస్య, విద్యుత్ కోతల కారణంగా అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. కొన్ని పరిశ్రమలు మూతపడే దశకు చేరుకున్నాయి. దీంతో కార్మికులకు ఉపాధి దొరకని పరిస్థితి నెలకొంది.
ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామికవాడల్లో ప్లాట్లు పొందిన నిరుద్యోగులు వాటిని అప్పనంగా అమ్మేసుకుంటున్నారు. దాదాపు 110 ప్లాట్లు ఉండగా వీటిలో 70 మొక్కుబడిగా ఏర్పాటు చేసినవి కాగా కేవలం స్థలం కోసమే నిర్మించినవి 54 వరకు ఉన్నాయి. మరో 6 నామమాత్రంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఔత్సాహికులకు ప్లాంట్లు అందజేసి సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించడం వలన ఈ దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని నిరుద్యోగులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.