పాలి(టెక్నిక్‌)ట్రిక్స్‌.! | Sakshi
Sakshi News home page

పాలి(టెక్నిక్‌)ట్రిక్స్‌.!

Published Thu, Jun 7 2018 8:38 AM

Politics At Cheepurupalli Government Polytechnic College In Vizianagaram - Sakshi

నారా ఖర్జూరనాయుడు... ఈ పేరు ఈ ప్రాంతంలో ఎవరూ విని ఉండరు. ఈ జిల్లాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఆయనెప్పుడూ ఈ జిల్లాకు వచ్చిందీ లేదు. ఈ జిల్లాకోసం ఆయన ఏం చేసిందీ లేదు. అయినా ఆయన పేరును ఓ ప్రభుత్వ సాంకేతిక విద్యాసంస్థకు పెడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ... ఇది కేవలం రాజకీయ లబ్ధికోసం స్థానికంగా ఓ మాజీ ఎమ్మెల్యే వేస్తున్న ఎత్తుగడ. ఎందుకంటే ఆ పేరు ఎవరిదో కాదు. సాక్షాత్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తండ్రిది. కేవలం ముఖ్యమంత్రిదగ్గర మార్కులు కొట్టేయడానికి జరుగుతున్న ఎత్తుగడపై స్వపక్షంలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలోని చీపురుపల్లిలోగల పాలిటెక్నిక్‌ కళాశాలకు నారా ఖర్జూరనాయుడు పేరు పెట్టాలన్న యోచన ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో చాలా మందికి ఆ పేరుగానీ, ఆ పేరు పాలిటెక్నిక్‌ కళాశాలకు ఎందుకుపెడుతున్నారనిగానీ తెలియదు. ఖర్జూరనాయుడు మరెవరో కాదు మన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు తండ్రి. చిత్తూరు జిల్లా నారా వారిపల్లెకు చెందిన సామాన్య రైతు. ఆయనకు విజయనగరం జిల్లాతో ఎలాంటి అనుబంధం ఉందో తెలియదుగానీ ఇప్పుడు ఆయనపై చీపురుపల్లికి చెందిన టీడీపీ నాయకుడొకరికి వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చింది. దానిని ఎలా చూపించాలో తెలియక ఇన్నాళ్లూ తనపేరు పెట్టుకున్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు తన పేరు తీసేసి ఖర్జూరనాయుడి పేరుపెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కళాశాల కోసం తాను రూ.4.91 కోట్ల భూమిని ఇచ్చినందున తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. సీఎం తండ్రి పేరు పెడతామంటే వద్దనేవారెవరుంటారు. వెంటనే అంగీకారం లభించేసింది. ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసేసింది. 

కళాశాల తెచ్చింది బొత్స
2012–13 సంవత్సరంలో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ (ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సీనియర్‌ నేత), అప్పటి ఎంపీ బొత్స ఝాన్సీల చొరవతో మంజూరైన ఈ కళాశాలకు చంద్రబాబు తండ్రి పేరు ఎందుకు పెట్టారో  అర్థం కాక స్థానికులు జుత్తు పీక్కుంటున్నారు. ఈ కళాశాలతో గానీ, ఊరితో గానీ ఎలాంటి సంబంధం లేకపోయినా రాజకీయ లబ్ధి కోసం ఖర్జూరనాయుడు పేరు తెరపైకి తెచ్చారనే విమర్శలు ప్రతిపక్షం నుంచి వ్యక్తమవుతున్నాయి. చిత్రమేమిటంటే ఈ విషయంలో స్వపక్షం నుంచే సదరు మాజీ ఎమ్మెల్యేకు చిక్కులు ఎదురవుతున్నాయి. జిల్లా టీడీపీ నేతలు కొందరు ఆయన అత్యుత్సాహంపై గుర్రుగా ఉండటంతో తొందరపడ్డానేమోనంటూ సన్నిహితుల వద్ద ఇప్పుడు బాధపడుతున్నారు.

భవనం ఇచ్చినందుకు సొంత పేరు...
బొత్ససత్యనారాయణ రాష్ట్ర మంత్రిగా, బొత్స ఝాన్సీ ఎంపీగా ఉన్నప్పుడు 2012–13 విద్యా సంవత్సరంలో చీపురుపల్లికి ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల మంజూరయ్యింది. 2014–15 విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణకు అనుమతి లభించింది. అప్పటికే బొత్స దంపతుల పదవీ కాలం పూర్తవడంతో ఈ సమాచారం వారికి చేరలేదు. వారి తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కిమిడి మృణాళిని కూడా ఈ విషయాన్ని తెలుసుకోలేదు. అందువల్ల విజయనగరం ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలోనే చీపురుపల్లి పాలిటెక్నికల్‌ తరగతులు నిర్వహణ మొదలెట్టారు. స్థానికుల డిమాండ్‌ మేరకు విష యం తెలుసుకున్న అప్పటి మంత్రి, ఎమ్మెల్యే మృణాళిని 2016–17 విద్యా సంవత్సరంలో చీపురుపల్లిలో తరగతులు జరిగేలా చర్యలు చేపట్టారు.

తరగతుల నిర్వహణకు ప్రత్యేక భవనం లేకపోవడంతో అప్పటికే ఖాళీగా ఉన్న జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశా ల భవనాలను వినియోగించారు. ఇదే అదునుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు అధికారం అండతో ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల పేరును జీబీఆర్‌ పాలిటెక్నికల్‌ కళాశాలగా పేరు మార్చారు. ప్రభుత్వ కళాశాల గోడలపై జీబీఆర్‌ ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలగా పేరు కూడా రాయించుకున్నారు. ఇంతవరకు ఇదే పేరు కొనసాగగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తండ్రి నారా ఖర్జూరనాయుడు పేరును ఆ కళాశాలకు ఇటీవల పెట్టించి జీవో తీసుకొచ్చారు.

ఐదెకరాలిచ్చి ఆయన పేరు పెట్టించా:
జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు అప్పట్లో నాలుగు ఎకరాలు ఇచ్చాను. తర్వాత పాలిటెక్నిక్‌ కళాశాలకు ఐదెకరాలు ఇచ్చాను. ఐదెకరాల విలువ రూ.4.91 కోట్లు అని అధికారులు పరిశీలించి నిర్ధారించారు. డోనర్‌గా నా పేరు లేదా నా కుటుంబ సభ్యుల్లో ఎవరిపేరైనా కళాశాలకు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ చంద్రబాబు లాంటి నాయకుడిని అందించినందుకు ఖర్జూరనాయుడి పేరు పెట్టమని అడిగాను రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు సేవలందిస్తున్న నాయకుడిని కన్నందుకు కృతజ్ఞతగా ఆయన తండ్రి ఖర్జూరనాయుడు పేరును చీపురుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలకు ప్రతిపాదించాను.
– గద్దే బాబూరావు, మాజీ ఎమ్మెల్యే 

Advertisement
 
Advertisement
 
Advertisement