అమ్మా .. మన్నించు!

Mother And Child Deaths in Machilipatnam Hospital - Sakshi

జిల్లాలో పెరుగుతున్న మాతా–శిశు మరణాలు

మాతృమరణాల్లో రాష్ట్రంలో నాల్గో స్థానం

పౌష్టికాహారం, రక్తహీనత లోపం వల్లే  మరణాలు

అవగాహన కల్పించటంలో అధికారుల నిర్లక్ష్యం

వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయ లోపం

మచిలీపట్నం:  తల్లీ బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసమని ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. కానీ జిల్లాలో మాతా– శిశు మరణాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. 2019 సంవత్సరంలో 801 శిశు మరణాలు నమోదయ్యా యి. ఒక్క జనవరి నెలలోనే 57 మంది పసికందులు మృత్యువాతపడ్డారు. అదే విధంగా వివిద కారణాలతో పురిటి నొప్పులతో (మెటర్నల్‌ డెత్‌)ఈ ఏడాది కాలంలో 57 మంది తల్లులు చనిపోయారు. శిశు మరణాల నమోదులో రాష్ట్ర సూచికలో జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. జిల్లాలో మాతా శిశు మరణాల తీవ్రతకు అద్దం పడుతోంది. అందుబాటులో ఆస్పత్రులు ఉన్నప్పటికీ జిల్లాలో మాతా–శిశు మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతుండటం, 18 ఏళ్ల వయస్సు లోపు గర్భం దాల్చుతుంటం ఆరోగ్యపరమైన సమస్యలు  ఉత్పన్నమౌతున్నాయి.
  గర్భం   దాల్చిన సమయంలో సరైన పౌష్టికాహారం అందటం లేదు. రక్తహీనత వల్లనే మాతృ మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది ప్రైవేటు వైద్యులు గర్భిణులతో మోతాదుకు మించి మందులు మింగిస్తుండటం మరణాలకు కారణంగా నిలుస్తోంది. ఆస్పత్రులకు పరీక్షల కోసమని వచ్చే ప్రతీ సందర్భంలో అవసరం లేకున్నా మందులు సిఫార్సు చేస్తుండటం వల్ల కూడా తల్లితోపాటు, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణు లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో అప్రమత్తం కావాల్సిన వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య  సరైన సమన్వయ లేకపోవటం వల్లనే పరిస్థితి చేయిదాటిపోతోందనే విమర్శలు ఉన్నాయి. 

నమోదులో ఎందుకీ నిర్లక్ష్యం  
గర్భం దాల్చిన మహిళకు  టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది, పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీల్లో సమగ్ర వివరాలను సకాలంలో నమోదు చేయాలి. కానీ వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమశాఖల మధ్య సమన్వయ లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకు జిల్లాలో 74,054 గర్భిణులను నమోదు కాగా, ఇందులో 65,085 మంది ఆసుపత్రుల్లో ప్రసవించారు. అలాగే 2019 ఏఫ్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు జిల్లాలో 58,404 గర్భిణుల నమోదు జరుగగా,  52,010 ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగాయి.  

ఈ లెక్కన చాలా మంది ఇంటివద్దనే ప్రసవిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2019 సంవత్సరంలో జిల్లాలో 55,617 జననాలుకు గాను ప్రసవ సమయంలో 53,004 మందిని నమోదు చేశారు. ముప్‌పై రోజుల తరువాత 772 మంది, ఒక ఏడాది లోపు 1,522 జననాల నమోదు జరిగింది. ఈ కారణంగా చాలా మంది మహిళలకు గర్భిణీ, ప్రసవానంతరం  సకాలంలో సరైన వైద్యం అందటం లేదనేది తేటతెల్లమౌంది. 

అంగన్‌వాడీల్లో అలసత్వం వీడాల్సిందే   
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు సరైన పౌష్టి కాహారం అందటం లేదు. గర్భిణులు కేంద్రానికి వచ్చి ఫీడింగ్‌ తీసుకోవటం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్న మాట. ఇటువంటప్పుడు గర్భిణులకు తగిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది..? ఈ విషయంలో  స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. మాతా– శిశు మరణాల నివారణ కోసమని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి, హైరిస్క్‌ ఉన్న       గర్భిణులకు తగిన వైద్య పరీక్షలు, అవగాహన కోసమని ప్రతీ నెల 9న ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభియాన్‌ (పీఎంఎస్‌ఎంఏ) పథకం క్రింద లక్షలాది రూపాయలు ఖర్చు చేసి శిబిరాలను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కార్యక్రమాలు విజయంతమైతే, మన జిల్లా మాతృమరణాల నమోదులో రాష్ట్ర సూచికలో ఎందుకు పైపైకి వెళ్తుందనేది అధికారులకే తెలియాల్సి ఉంది.జిల్లా ఉన్నతాధికారులు ఇటువంటి సమస్యలపై తక్షణమే ఫోకస్‌ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

మరణాలు లేకుండా అప్రమత్తం
మాతా, శిశు మరణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం.  భవిష్యత్‌లో మాతా– శిశు మరణాలు లేకుండా ప్రత్యేక సాంకేతితకను వినియోగిస్తున్నాం. ప్రత్యేక యాప్‌ ద్వారా గర్భిణికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తున్నాము. దీనివల్ల గర్భిణికి  తగిన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ ఉంటుంది.  –డాక్టర్‌ టీఎస్‌ఆర్‌ మూర్తి, డీఎంహెచ్‌ఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top