సై‘బరి’ తెగింపు | Vijayawada Cyber ​​Station receives 20 cyber complaints in the last 50 days | Sakshi
Sakshi News home page

సై‘బరి’ తెగింపు

May 10 2025 6:10 AM | Updated on May 10 2025 6:10 AM

Vijayawada Cyber ​​Station receives 20 cyber complaints in the last 50 days

వాట్సాప్‌నూ వదలట్లేదు 

హ్యాకింగ్‌తో రెచ్చిపోతున్న నేరగాళ్లు

పొరపాటున వెరిఫికేషన్‌ కోడ్, ఓటీపీ మీ నంబర్‌కు వచ్చిందని నమ్మిస్తున్న మోసగాళ్లు  

నమ్మి కోడ్, ఓటీపీ చెప్పిన వెంటనే అకౌంట్‌ హ్యాక్‌ 

నగదు అక్రమ లావాదేవీలు, బెట్టింగ్, డేటింగ్‌ వంటి 

చట్టవిరుద్ధ చర్యలకు అకౌంట్‌ వినియోగం 

పెరుగుతున్న బాధితులు 

విజయవాడ సైబర్‌ స్టేషన్‌కు గడిచిన 50 రోజుల్లో 20 ఫిర్యాదులు

‘విజయవాడ చిట్టినగర్‌కు చెందిన ఓ వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌కు ఓ వెరిఫికేషన్‌ కోడ్, ఓటీపీ వచ్చాయి. వెంటనే ఓ ఆగంతకుడి నుంచి కాల్‌ వచ్చింది. పొరపాటున మీ నంబర్‌కు నాకు సంబంధించిన కోడ్, ఓటీపీ వచ్చిందని, దయచేసి దాన్ని తనకు చెప్పాలని ఆగంతకుడు అభ్యర్ధించాడు. ఫోన్‌లలో ఇలాంటి పొరపాటు మెసేజ్‌లు రావడం సహజమేనని నమ్మి. ఆ ఆగంతకుడికి ఆ వ్యక్తి కోడ్, ఓటీపీ చెప్పాడు. 

మరుసటి రోజు ఉదయాన్నే గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌ తన స్నేహితులకు పంపేందుకు ఆ వ్యక్తి విఫలయత్నం చేశాడు. 12 గంటల పాటు తన వాట్సాప్‌కు ఎలాంటి మెసేజ్‌లు, ఫొటోలు రావడం లేదని, తన నుంచి ఎవరికీ మెసేజ్‌లు వెళ్లడం లేదని గ్రహించాడు. ఎట్టకేలకు తన వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయిందని గ్రహించి హుటాహుటిన సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌కు పరుగు పెట్టాడు’.

విజయవాడస్పోర్ట్స్‌: డిజిటల్‌ అరెస్ట్, జాబ్‌ఫ్రాడ్, హనీ ట్రాప్, ఫిషింగ్, డేటా బ్రీచ్‌ తదితర వందకుపైగా స్కామ్‌లతో ప్రజలను ఆరి్ధక దోపిడీ చేసిన సైబర్‌ నేరగాళ్లు.., తాజాగా రూటు మార్చారు. ఎండ్‌–టు–ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో వ్యక్తిగత సమాచార మార్పిడికి రక్షణగా ఉన్న వాట్సాప్‌పైనా కేటుగాళ్లు కన్నేశారు. వాస్తవ ఖాతాదారులను బురిడీ కొట్టించి హ్యాక్‌ చేస్తూ సరికొత్త నేరాలకు పాల్పడుతున్నారు. ఒకే నంబర్‌తో వేర్వేరు ఫోన్లలో ఎన్నైనా వాట్సాప్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసుకునే వెసులుబాటును సైబర్‌ నేరస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. 

‘‘ నేరగాళ్లు వారి ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న వాట్సాప్‌కు మీ నంబర్‌ ఇస్తారు. దీంతో వాట్సాప్‌ సంస్థ నుంచి మీ మొబైల్‌కు వెరిఫికేషన్‌ కోడ్, ఓటీపీ వస్తుంది. ఈ రెండూ తెలుసుకునేందుకు మిమ్మల్ని ఫోన్‌లో సంప్రదిస్తారు. పొరపాటున కోడ్, ఓటీపీ మీ నంబర్‌కు వచ్చిందని, దాన్ని కాస్త చెప్పాలని అభ్యర్థిస్తారు. కోచ్, ఓటీపీ వారికి చెప్పగానే మీ వాట్సాప్‌ ఖాతా వారి ఫోన్‌లో ఓపెన్‌ అవుతుంది. 

ఆ వెంటనే వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి డిజెప్పీరింగ్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేస్తారు. మీ వాట్సాప్‌ వచ్చే అన్ని మెసేజ్, ఫోటోలు పూర్తిగా వారి ఫోన్‌కు వెళ్లేలా సెట్టింగ్స్‌ చేసి హ్యాక్‌ చేస్తారు. వాట్సాప్‌ సంభాషణ పూర్తిగా వారి ఆ«దీనంలోకి తీసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలు, వ్యక్తిగత హననానికి, ఆర్థిక దోపిడీకి పాల్పడతారు.  

హ్యాకింగ్‌తో అపరిమితమైన నేరాలు
వాట్సాప్‌లో చాటింగ్, గ్రూప్‌ల ఆధారంగా ఆ వాట్సాప్‌ వినియోగించే వ్యక్తి మనస్తత్వాన్ని నేరగాళ్లు అంచనా వేస్తున్నారు. ఏయే గ్రూప్‌లకు మెసేజ్‌లు పార్వాడ్‌ చేస్తున్నారో.., ఎవరెవరితో చాటింగ్‌ చేస్తున్నారో.., ఎలాంటి సంభాషణలు చేస్తున్నారో.., క్షుణ్ణంగా పరిశీలిస్తారు. దీని ఆధారంగా స్నేహి­తులు, బంధువులు, సహోద్యోగులు, వ్యాపార భాగస్వాములను వాట్సాప్‌ ద్వారా డబ్బులు అభ్యర్థిస్తారు. వాస్తవ ఖాతాదారుడికి తెలియకుండానే అతని పేరుతో చాటింగ్‌ చేసి డబ్బులు వసూలు చేస్తారు. 

వాట్సాప్‌ బ్యాంకింగ్‌ వ్యాలెట్‌లో ఉన్న నగదునూ లూటీ చేస్తారు. డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌) ఫొటోను మారి్ఫంగ్‌ చేసి అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. వాట్సాప్‌ కాంటాక్ట్, గ్రూప్‌లలో ఉన్న మహిళల డీపీలను మారి్ఫంగ్‌ చేస్తారు. మహిళలకు అసభ్య మెసేజ్‌లు పంపి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డేటింగ్, బెట్టింగ్, గేమింగ్‌ యాప్‌లను వినియోగించడమే కాకుండా గ్రూప్‌లలో ప్రమోట్‌ చేసి సొమ్ము చేసుకుంటారు. వాట్సాప్‌ గ్రూప్‌లలోకి, వ్యక్తిగత నంబర్లకు ఏపీకే ఫైల్స్, మాల్వేర్‌లను పంపిస్తారు. 

పొరపాటున వాటిని క్లిక్‌ చేసిన వ్యక్తుల అకౌంట్లను హ్యాక్‌ చేస్తారు. చైల్డ్‌ పోర్నోగ్రఫి, పోర్న్‌ వీడియోలను, న్యూడ్‌ ఫొటోలను వాట్సాప్‌ అకౌంట్‌ ద్వారా ఇతరులకు షేర్‌ చేస్తారు. స్త్రీ/పురుషు వ్యభిచారుల(మేల్‌ ఎస్కార్ట్‌ సర్వీస్, ఫిమేల్‌ ఎస్కార్ట్‌ సర్వీస్‌) వివరాలను ఇతరులకు షేర్‌ చేసేందుకు ఈ వాట్సాప్‌ను వినియోగిస్తారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచార మారి్పడికి హ్యాక్‌ చేసిన అకౌంట్లను వినియోగిస్తారు. వాట్సాప్‌ చానల్‌ ద్వారా సంఘ వ్యతిరేక, అసభ్య సమాచార మార్పిడి చేసి కేసుల్లో ఇరికిస్తారు.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోర్టల్లో ఫిర్యాదు చేయండి
కీ ప్యాడ్‌ ఫోన్‌ వినియోగించే వారు సైబర్‌ నేరస్తుల ట్రాప్‌లో అత్యధికంగా పడుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే ఉన్నత విద్యావంతులూ బాధితులుగా ఉన్నారు. వాట్సాప్‌ మాత్రమే కాకుండా ఇన్‌స్టా, టెలిగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్‌ ఖాతాలకు సంబంధించిన వెరిఫికేషన్‌ కోడ్, ఓటీపీలను ఇతరులకు చెప్పడం, షేర్‌ చేయడం చేయరాదు. సోషల్‌ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్‌ హ్యాకింగ్‌కు గురైతే వెంటనే లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోర్టల్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. 

గూగుల్‌లోకి వెళ్లి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అని టైప్‌ చేయగానే వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది, అందులో ‘మీరు పోలీసా’ అని అడుగుతుంది, ‘నో’ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయగానే కొత్త ఫారం ఓపెన్‌ అవుతుంది. అందులోని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఇష్యూష్‌ ఆప్షన్‌లో హ్యాకింగ్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ఫిర్యాదు ఆన్‌లైన్‌లో రికార్డవుతుంది. ఫిర్యాదు చేయడంలో ఏమైనా సందేహాలుంటే సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలి. –శ్రీరామచంద్రమూర్తి రాళ్లపల్లి, ఎస్‌ఐ, సైబర్‌ క్రైం, ఎన్టీఆర్ జిల్లా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement