శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెలగవీధిలో శనివారం అర్ధరాత్రి ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది.
శ్రీకాకుళం (వీరఘట్టం) : శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తెలగవీధిలో శనివారం అర్ధరాత్రి ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వివరాల ప్రకారం.. తెలగవీధికి చెందిన గ్రంధి రాజు, లిల్లీగ్రేస్లు భార్యాభర్తలు. వీరికి ఐదు సంవత్సరాల క్రితం పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. కాగా గత కొంతకాలంగా భార్యాభర్తలు తరచూ గొడపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవైంది. కోపంతో గదిలోకి వెళ్లిన లిల్లీగ్రేస్ పడుకుని ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు.
కానీ ఆదివారం ఉదయం గది తెరిచే చూస్తే లిల్లీగ్రేస్(22) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని భర్త రాజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తెలిపాడు. అయితే రాత్రి పూట అరుపులు వినపడ్డాయని, అత్త, మామ, భర్త కలిసి ఆమెను చంపి ఉరేసి ఉంటారని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజమండ్రిలో ఉన్న మృతురాలి తల్లిదండ్రులు తాము వచ్చేంతవరకు శవాన్ని కిందకు దించవద్దని పోలీసులను కోరారు.