మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షపై పంతాలకు పోయి కాపు జాతిని అవమానించేలా వ్యవహరిస్తే
ప్రభుత్వ తీరు మారక పోతే తగిన మూల్యం
వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షపై పంతాలకు పోయి కాపు జాతిని అవమానించేలా వ్యవహరిస్తే తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు హెచ్చరించారు. మంగళవారం రాత్రి ఆయన తననుకలిసిన విలేకర్లతో మాట్లాడుతూ ముద్రగడ దీక్షను ఉద్యమ సమస్యగా ప్రభుత్వం చూడడంలేదన్నారు.
ఓ వైపు చర్చలు పేరుతో డీఐజీ స్థాయి అధికారిని పంపి, సానుకూల వాతావరణం ఏర్పడిన సమయంలో మంత్రులను ఉసిగొలిపి ఎగతాళిగా మాట్లాడించారంటూ ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు. సమస్య జటిలమయ్యేలా చేసి శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే సాకుతో పెద్ద ఎత్తున బలగాలు మోహరించి కాపు సామాజిక వర్గంపై ఉక్కుపాదం మోపారన్నారు. ఇళ్ళల్లోకి వెళ్ళి మరీ బయటకు ఈడ్చుకొచ్చి స్టేషన్లకు తరలించి కేసులు పెట్టారన్నారు. మహిళలపై సైతం దురుసుగా ప్రవర్తించారన్నారు.
బాధ్యతాయుతమైన సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ సమస్యను వ్యత్తిగత ప్రతిష్టగా తీసుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారన్నారు. వివాదంలో తమదే పై చేరుుగా ఉండాలనే ధోరణిలో అటు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వం వ్యవహరిస్తుండడం వల్లే పరిస్థితి కొలిక్కి రాలేదన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, పోలీసు పాలన సాగుతోందని విమర్శించారు.
బెయిల్‌పై విడుదలైన ముఖ్యనేతలు వాసిరెడ్డి ఏసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు తదితరులను ముద్రగడతో కలువకుండా అడ్డు పడడం సమంజసం కాదన్నారు. ఇలాంటి ధోరణి ద్వారా కాపు కులస్తులను మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.