తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరి స్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన ప్రదర్శనలకు జిల్లాలో జరుగుతున్న మూడో విడత రచ్చబండ సభలు వేదికవుతున్నాయి.
సాక్షి, కరీంనగర్: తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరి స్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుపై నిరసలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన ప్రదర్శనలకు జిల్లాలో జరుగుతున్న మూడో విడత రచ్చబండ సభలు వేదికవుతున్నాయి. ఫ్లెక్సీలపై సీఎం కిరణ్ ఫొటోలు కనిపించరాదని, ఆయన సందేశం వినిపించరాదని.. ఫ్లెక్సీలను కత్తిరించడంతోపాటు సీఎం సందేశాన్ని బహిష్కరిస్తున్నారు. ఈ విషయం క్రెడిట్ తమకే దక్కాలని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మేలు తలపెట్టాల్సిన రచ్చబండలు కాస్త సీఎం వ్యతిరేక సభలుగా మారుతున్నాయి. శుక్రవారం జిల్లావ్యాప్తంగా జరిగిన రచ్చబండ సభల్లో నిరసనలు పెల్లుబికాయి.
కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లో జరిగిన రచ్చబండలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలను ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్యెల్యే గంగుల కమలాకర్ తొలగించి ద హనం చేశారు. ఎంపీడీవో దేవేందర్‌రాజు సీఎం సందేశాన్ని చదువుతుండగా ఆ దరిద్రుడితో మనకు పనిలేదంటూఅడ్డుకున్నారు. బంగారుతల్లి బాండ్లపై ఉన్న సీఎం చిత్రాన్ని కట్ చేసి లబ్దిదారులకు అందించారు.
గొల్లపల్లిలో సీమాంధ్ర సీఎం డౌన్ డౌన్ అంటూ సభావేదిక వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. సీఎం సందేశపత్రాలను చించివేసి, ఆయన బొమ్మలను ప్లెక్సీలోంచి తొలగించారు.
రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం కిరణ్‌కుమార్ బొమ్మ ఉండడంతో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీపై బొమ్మ కనిపించకుండా స్టికర్ అతికించారు.
జగిత్యాలలో నిర్వహించిన రచ్చబండ రసాభాసగా మారింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ఉండడంపై స్థానిక యువజన కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు అడ్డుకున్నా స్టేజీ పైకి ఎక్కి సీఎం ఫ్లెక్సీకి తెల్లపేపర్ అంటించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
సీఎం ఫ్లెక్సీకి తెల్లకాగితాలు అంటించడాన్ని ఎంపీ మధుయాష్కి అడ్డుకున్నారు. వ్యక్తులు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమని, ఫ్లెక్సీలకు తెల్లకాగితాలు అంటించడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన పేర్కొన్నారు.చందుర్తిలో రచ్చబండ ఫ్లెక్సీపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను తొలగించి మంత్రి శ్రీధర్‌బాబు ఫొటోను ఏర్పాటు చేశారు. సీఎం ఫొటోను టీఆర్‌ఎస్ తొలగిస్తారని భావించిన కాంగ్రెస్ నాయకులు వారికంటే ముందే ఈ పనిచేశారు.
చొప్పదండిలో ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య సీఎం ఫొటోను కత్తిరించారు. వేదికపై ఉన్న ఫ్లెక్సీని తొలగించేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీఎస్‌జేఏసీ నాయకులు తోపులాడుకున్నారు. టీఎస్‌జేఏసీ నాయకులు సీఎం ఫ్లెక్సీని దహనం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు సీఎం ఫొటో స్థానంలో నిలువెత్తు ఎంపీ ఫొటోను అతికించారు.
శంకరపట్నంలో టీఆర్‌ఎస్ నాయకులు సీఎం ఫొటో కత్తిరిస్తుండగా ఫ్లెక్సీ చిరిగింది. దీంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. సీఎం ఫొటోను మా నాయకులే కత్తిరిస్తుండగా, ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించగా విప్ సూచన మేరకు వారిని విడిచిపెట్టారు. టీఆర్‌ఎస్ సర్పంచులు వేదికపైకి రావడంతో వివాదం సద్దుమణిగింది.