ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో టవర్‌ను మావోయిస్టులు పేల్చివేసిన విషయం విదితమే.
హైదరాబాద్: ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో టవర్‌ను మావోయిస్టులు పేల్చివేసిన విషయం విదితమే. అదే సమయంలో ఉత్తర తెలంగాణ పర్యటనలో ఉన్న డీజీపీ ప్రసాదరావు సైతం వారి కార్యకలాపాలను సమర్థవంతంగా అణచివేస్తామని చెప్పారు. అయితే, తాజాగా ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన దంతెవాడ, కుసుమ జిల్లాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు పెరగడమే గాక ఖమ్మం సరిహద్దుల్లో వారి కదలికలు సాగుతున్నాయని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కీలకమైన సమాచారం అందింది.
దాదాపు 12 మందితో కూడిన రెండు మావోయిస్టు బృందాలు ఒకటి తర్వాత మరొకటిగా ఈ ప్రాంతంలో కదలాడుతున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో గ్రేహౌండ్స్‌తో గాలింపు చర్యలను విస్తృతం చేశారు. అలాగే, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పోలీసు యంత్రాంగాలను కూడా అప్రమత్తం చేశారు. ఈ విషయమై ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని, అయితే వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు.