ఆ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయడమే కరెక్ట్‌!

JNTU Professors Said To Demolish The Building In Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: కాకినాడలో పూర్తిగా ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్‌ అపార్ట్‌మెంట్‌ భవనాన్ని జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ల బృందం శుక్రవారం పరిశీలించింది. ఎనిమిది మంది అధ్యాపకులతో కూడిన బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి మూడు పిల్లర్లు పూర్తిగా పాడైపోయాయని తెలిపింది. రెండు వారాల్లో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అందరినీ ఖాళీ చేయించి భవనాన్ని కూల్చివేయాలని పేర్కొంది. ఒకవేళ రిట్రో ఫిట్టింగ్‌ టెక్నాలజీతో అపార్ట్‌మెంట్‌ను ఉంచాలనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని తెలిపింది. అందుకు ముంబై నుంచి అనుభవజ్ఞుల బృందం వచ్చి పరిశీలించి అనుకూలం అని చెప్తేనే రిట్రో ఫిట్టింగ్‌ చేసుకోవచ్చు అని సూచించింది. ఇక భవన నిర్మాణంలో నాసిరకం మెటీరియల్ వాడారని, అలాగే ‍స్టీల్‌ కూడా తుప్పు పట్టిందని గుర్తించారు. 

భయం భయం...
బహుళ అంతస్తు భవనం పక్కకు ఒరిగి ప్రమాదభరితంగా మారగా అపార్టుమెంటువాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆగమేఘాలపై 39 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. భాస్కర ఎస్టేట్‌ పేరుతో 13 ఏళ్ల క్రితం 60 పిల్లర్లతో రెండు భాగాలుగా విభజించి ఒక భాగంలో 20 ఫ్లాట్లు, మరో భాగంలో 20 ఫ్లాట్లు కలిపి మొత్తం 40 ఫ్లాట్లతో కూడిన భవనాన్ని నిర్మించారు. భవనానికి కింది భాగంలో మొత్తం షెల్టర్‌గా ఉంచారు. ఈ భాగంలో నాలుగు పిల్లర్లు బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెద్ద శబ్దంతో పగుళ్లు తీశాయి. ఈ విషయాన్ని అపార్టుమెంట్‌వాసులు గమనించలేదు. ఉదయం చూసేసరికి నాలుగు పిల్లర్లలో మూడు పిల్లర్లు కిందిభాగంలో సిమెంట్‌ అచ్చుఅచ్చులుగా రాలిపోవడం గమనించారు. ఒక పిల్లరు పగులు తీసింది. ఇది మామూలేగానే జరుగుతున్న విషయంగా ఫ్లాట్ల యజమానులు వదిలేశారు.

అయితే ఈ నాలుగు పిల్లర్లకు సంబంధించి ముందు, వెనుక భాగంలో ఉన్న ఫ్లాట్ల పైభాగంలో, గదుల్లోను నెర్రలు తీసి పెచ్చులూడి పడడంతో నిర్వాసితులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అక్కడే ఉన్న మిగిలిన ఫ్లాట్ల యజమానులకు ఈ విషయాన్ని చెప్పడంతో కొందరు మా ఫ్లాట్లు కూడా పగుళ్లు తీస్తున్నాయంటూ భయాందోళన వ్యక్తం చేశారు. విషయాన్ని కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణకు, త్రీటౌన్‌ పోలీసులకు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో సమాచారం అందించారు. దీంతో అధికార యంత్రాంగం సంఘటన స్థలాన్ని పరిశీలించి, తక్షణం భవనాన్ని ఖాళీ చేయాలని 39 కుటుంబాలను ఆదేశించారు. భవనం నాణ్యత ప్రశ్నార్థకంగా ఉందని, దీనిపై ఇంజినీరింగ్‌ అధికారులు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు పరిశీలన చేసేంత వరకు ఈ ఫ్లాట్లలో ఏ ఒక్కరూ నివసించడానికి వీల్లేదంటూ అధికారులు హుటాహుటిన ఆ అపార్టుమెంట్‌లో ఉన్న కుటుంబాలను ఖాళీ చేయించారు.

భాస్కర్‌ ఎస్టేట్‌ అపార్టుమెంట్‌ ఏ క్షణంలోనైనా కూలవచ్చని, ఇందులో ప్రజలు నివసించడం మంచిది కాదని అధికారులు చెబుతున్నారు. ఈ భవనం పిల్లర్లు పగుళ్లు తీయడం, కుంగడం వంటి విషయాలపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేశాకే ఈ భవనాన్ని ఉంచాలా? కూల్చివేయాలా? అనే విషయాన్ని నిర్ధారిస్తామని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ విలేకర్లకు తెలిపారు. ప్రస్తుతం ఈ భవనంలో కుటుంబాలు నివసించడం అంత క్షేమం కాదన్నారు. ఆర్డీఓతో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ కె.రమేష్‌ , డీఎస్పీ కె.కుమార్‌ తమ, తమ సిబ్బందితో వచ్చి భవనాన్ని పరిశీలించారు. శాలిపేట అగ్నిమాపక అధికారి ఎం.రాజా తమ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top