అధికారమా.. మజాకా | It plans to the authorities .. | Sakshi
Sakshi News home page

అధికారమా.. మజాకా

Jun 28 2014 2:05 AM | Updated on Sep 5 2018 3:24 PM

అధికారమా.. మజాకా - Sakshi

అధికారమా.. మజాకా

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆ వ్యక్తిని ఆనందంలో ముంచెత్తాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో విజయం వరించింది.

ఇద్దరు డీఎస్పీలు.. ఐదుగురు సీఐలు.. ఎనిమిది మంది ఎస్‌ఐలు సుమారు వందమంది పోలీసులు.. ఇంత బందోబస్తు ఎందుకనుకుంటున్నారా..అంత్యక్రియల కోసం అంటే ఆశ్చర్యమేస్తుంది కదూ..అతనేం వీవీఐపీ కాదు.. సాదాసీదా వ్యక్తే.. ఎర్రగుంట్ల కౌన్సిలర్ పురుషోత్తం తండ్రి కావడమే ఇంత బందోబస్తు.. టీడీపీ క్యాంపులో ఉన్న పురుషోత్తం తండ్రి అంత్య క్రియల్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు పోలీసులు నానాహంగామా సృష్టించారు.
 
 సాక్షి ప్రతినిధి, కడప: మున్సిపల్  ఎన్నికల ఫలితాలు ఆ వ్యక్తిని ఆనందంలో ముంచెత్తాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో విజయం వరించింది. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గాలం వేయడంతో అందులో చిక్కాడు.. అంతలోనే విషాదం వెంటాడింది. కన్న తండ్రి మృతి చెందాడనే దుర్వార్త చెవిన పడింది. స్వగ్రామానికి బయలు దేరాడు. అయితే ఆయనకు రాజదర్బార్ ఠీవి దక్కింది. తండ్రి మృతి చెందాడని ఆవేదన చెందాలో, వీవీఐపీ స్థాయికి మించి హై సెక్యూరిటీ లభిందని ఆనందపడాలో తెలియని అయోమయంలో పడ్డాడు.
 యర్రగుంట్ల మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్‌గా వైఎస్సార్‌సీపీ తరుపున ఎస్. పురుషోత్తం పోటీ చేశారు.
 
 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. 20 వార్డులున్న యర్రగుంట్ల మున్సిపాలిటీలో 18వార్డులను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 2వార్డులతో మాత్రమే తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకుంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో యర్రగుంట్ల మున్సిపాలిటీపె రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ దృష్టి పడింది. అందులో భాగంగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను  ప్రలోభపెట్టారు. 8 మందిని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. వారిలో పురుషోత్తం కూడా ఉన్నారు. పక్షం రోజులుగా క్యాంపుల్లో కాలం గడుపుతున్నారు.
 
 చంద్రబాబుతో షేక్‌హ్యాండ్...స్టార్ హోటల్లో విడిది..
 ఈనెల 10న వైఎస్సార్‌సీపీ నుంచి తెలుగుదేశంలోకి జంప్ అయిన కౌన్సిలర్లు మూడు రోజుల అనంతరం తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పరిచయ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అనంతరం స్టార్ హోటళ్లు మారుతూ క్యాంపుల్లో ఉండిపోయారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ వెలువడటంతో రెండు, మూడు రోజుల్లో స్వగ్రామానికి చేరుకుంటామన్న తరుణంలో పురుషోత్తంకు విషాదవార్త విన్పించింది.
 
 తండ్రి సాల్మన్‌లూకన్ (60) అర్ధాంతరంగా మృతి చెందినట్లు తెలియవచ్చింది. చివరి చూపు చూడాలనే తలంపుతో యర్రగుంట్లకు బయలుదేరారు. చేజిక్కించుకున్న కౌన్సిలర్ ఎక్కడ చేజారిపోతాడో అనే బెంగ టీడీపీ నేతలకు పట్టుకుంది. దాంతో అధికార దర్పాన్ని ప్రదర్శించారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు.
 
 టీడీపీ చీప్ పాలి‘ట్రిక్స్’....
 తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పురుషోత్తం వస్తున్నాడని తెలుసుకున్న బంధువులు ఆయన ఇంటికి చేరుకున్నారు. మీరెలా బంధువులంటూ వారికి యక్షప్రశ్నలు తలెత్తాయి. అడుగడుగునా పోలీసుల తనిఖీలు, ఇంటి వద్ద భారీ బందోబస్తు మధ్య పురుషోత్తం ఇళ్లు చేరుకున్నాడు. తండ్రి  మృతదేహాన్ని చూడగానే బోరున విలపించాడు. అంతలోనే అంత్యక్రియలకు సిద్ధం చేశారు. శ్మశానవాటిక వరకూ పురుషోత్తంకు 20 మంది సాయుధపోలీసులు బందోబస్తుగా ఉండి పోయారు.
 
 అంత్యక్రియలు అయిన మరుక్షణమే తిరిగి టీడీపీ క్యాంపునకు తీసుకెళ్లారు. పట్టుమని పదినిమిషాలైన తండ్రి అంత్యక్రియల వద్ద ఉండే అవకాశం లేకుండా పోయింది. ఇరువురు డీఎస్‌పీలు, ఐదుగురు సీఐలు, 8మంది ఎస్‌ఐలు, సుమారు వందమంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. యర్రగుంట్లకు వచ్చే అన్నిమార్గాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. పురుషోత్తం ఏమాత్రం చేజారిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వామిభక్తి చాటుకున్నారు. ఈ సంఘటనలు చూసి అధికారమా..మజాకా.. అంటూ జనం చర్చించుకోసాగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement