పొలం బాటలో.. పట్టభద్రుడు

Ideal farmer Prasad Special Story - Sakshi

పెట్టుబడిలేని సేద్యంతో సిరుల పంటలు

పలు అవార్డులు ఆయన సొంతం

ఆదర్శ రైతు ప్రసాద్‌ విజయగాథ

ఇంజినీరింగ్‌ చదివిన ఏ కుర్రాడైన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలనుకుంటాడు. కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలతో తన ప్రతిభను కొలమానంగా వేసుకుంటారు. అయితే మదనపల్లెకు చెందిన ఆదర్శ రైతు ఎం.సి.వి. ప్రసాద్‌ దీనికి పూర్తి భిన్నం. తాను సంపాదించిన జ్ఞానం వ్యవసాయాభివృద్ధికి ఉపయోగపడాలని పరితపించాడు. తండ్రి ఇచ్చిన పొలంలో వ్యవసాయం మొదలుపెట్టాడు. ఖర్చులేని వ్యవసాయం(జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) చేస్తూ అద్భుతాలు సాధిస్తున్నాడు.

మదనపల్లె సిటీ: చదువు జ్ఞానాన్నిస్తుంది. సేద్యం ఆహారాన్ని అందిస్తుంది. ఆ రెండూ కలిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని నిరూపిస్తున్నాడు  మదనపల్లెకు చెందిన ఆదర్శ రైతు ఎం.సి.వి.ప్రసాద్‌. చదువుకుంది సివిల్‌ ఇంజినీరింగ్‌. బెంగళూరులోని ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం. ఇవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. నేల తల్లికి ఏదో చేయాలని పరితపించేవాడు. అందుకే ప్రేమతో హలం పట్టాడు. అనుభవ పాఠాలతో పాటు నాన్న పద్మనాభరెడ్డి ఇచ్చిన 80 ఎకరాల భూమిలో వ్యవసాయ పనులు మొదలు పెట్టాడు. మహారాష్ట్రకు చెందిన రైతుభాందవుడు సుభాష్‌పాలేకర్‌ బాటలో పయనిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఖర్చులేని వ్యవసాయం (జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ ) అమలు చేస్తున్నారు. తండ్రి వ్యవసాయంలో దిట్ట. మొట్టమొదట మదనపల్లెకు టమాట పంటను పరిచయం చేశారు. తండ్రి బాటలో పయనిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు.

మదనపల్లె సమీపంలోని చిన్నతిప్పసముద్రం(సీటీఎం) వద్ద ప్రసాద్‌కు 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ అడుగుపెడితే చాలు వ్యవసాయానికి కొత్త జీవనాన్ని అందిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ఖర్చులేని వ్యవసాయం ఆయన సొంతం2008లో మహారాష్ట్రకు చెందిన  సుభాష్‌పాలేకర్‌ అనే వ్యవసాయవేత్త తిరుపతికి వచ్చారు. ఖర్చులేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. దీనికి ఆకర్షితులైన ప్రసాద్‌ అదే బాటలో పయనిçస్తున్నారు. రసాయన, సేంద్రియ ఎరువుల అవసరం లేకుండా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరిస్తున్నారు. 80 ఎకరాల తన క్ష్రేతంలో మిరప, టమట, చెరకు, సజ్జ, గోధుమ, మొక్కజొన్న, వంగ, మొక్కజొన్న, వేరుశనగ, కందులు, మినుములు పండిస్తున్నారు. కూరగాయల సాగు కోసం పాలిçహౌస్‌ ఏర్పాటు చేశారు. వీటితో పాటు దానిమ్మ, ఉసిరి, అల్లనేరేడు, జామ వంటి పండ్లను పండిస్తున్నారు. ఈ విధానంలో బీజామృతం, జీవామృతం,ç బ్రహ్మాస్త్రం వంటి వాటిని ఉపయోగించి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని నిరూపించారు. ఈ విధానం వల్ల తక్కువ పెట్టుబడి, పర్యావరణ పరిరక్షణ, భూసారం పెరుగుదల, నీటి వనరుల పొదుపు వంటి వాటిని సాధించవచ్చు. 2008కి ముందు ఏటా సుమారు రూ.10 లక్షల పెట్టుబడి పెట్టిన ప్రసాద్‌కు పాలేకర్‌ విధానానికి మారిన తర్వాత అలాంటి అవసరమే లేకుండా పోయింది. ఇదంతా కేవలం దేశవాళీ ఆవులను నమ్ముకోవడం వల్ల కలిగిన లాభమంటారు.

చెరకు: ఏడెకరాల్లో చెరకు సాగు చేశారు. బెల్లం తయారీ చేసి విక్రయిస్తూ ఎకరాకు రూ.1.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు రూ. 70 వేలు ఖర్చు చేస్తున్నారు.

లెమన్‌గ్రాస్‌: ఆరు ఎకరాల్లో లెమన్‌గ్రాస్‌ సాగు చేశారు. పంట నుంచి నూనె తీసేందుకు స్టీమ్‌ డిస్టిలేషన్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఎకరా పంటకు దాదాపు 250 లీటర్ల వరకు నూనె వస్తుంది. మార్కెట్‌లో కిలో నూనె రూ.1000 వరకు ఉంటుంది. ఈ çపంట సాగు ద్వారా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పామారోజా, దవనం, సిట్రోనెల్లా, వట్టివేర్లు, తులసి, లావెండర్‌ వంటి సుగంధ ఔషద మొక్కలు సాగు చేస్తున్నారు. వ్యవసాయక్ష్రేతంలో ఎనిమిది రకాల దేశవాళీ ఆవులను పోషిస్తున్నారు. వాటి పేడ, మూత్రంతో జీవామృతం తయారు చేసి భూసారాన్ని పెంచేందుకు ఎరువుగా వినియోగిస్తున్నారు. తెగుళ్ల నివారణకు బ్రహ్మాస్త్రం (వేప, కానుగ, సీతాఫలం, ఉమ్మెత్త, జిల్లేడు, వావిలాకులను 15 లీటర్ల గోమూత్రంలో ఉడికించి తయారు చేసి వినియోగిస్తున్నారు. గోఆధారిత కషాయాల ద్వారా పంటలకు సోకే సమస్త రోగాలను నివారిస్తున్నారు. యాంత్రీకరణకు తోడు బిందు పద్ధతిలో పంటలకు నీరందిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సాగులో ఆధునిక, సేంద్రియ పద్ధతులను మేళవిస్తూ పంట మార్పిడి విధానాన్ని అవలంబిస్తున్నారు.

ప్రకృతివనం: ప్రకృతివనం పేరుతో 52 రకాల సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తూ 55 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

విద్యార్థుల సందర్శన..
వ్యవసాయ క్షేత్రాన్ని వివిధ వ్యవసాయ, ఉద్యాన విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశోధనకు వస్తుంటారు. ఏపీతో పాటు కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సందర్శిస్తున్నారు.

సెలేషియా మొక్కలు పెంపకం..
వ్యవసాయ క్ష్రేతంలో మధుమేహ మందుకు పని కివచ్చే సెలేషియా మొక్కల పెంపకం చేపట్టారు. దాదాపు ఎనిమిది ఎకరాల్లో మొక్కలు పెంచుతున్నారు. జపాన్‌కు చెందిన టకామా కంపెనీతో  దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు.

అవార్డులు:
దవనం మొక్కలను అత్యధికంగా సాగు చేయడంతో 2005లో సీఎస్‌ఐఆర్‌ ఉన్నతి అవార్డును అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ నుంచి అందుకున్నారు.
2011లో ఉత్తమ తైల యూనిట్‌ నిర్వహణకు సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ ఆర్థోపెడిక్‌ సంస్థ అవార్డు అందుకున్నారు.
2011లో ఏపీ ఎన్విరాన్‌మెంట్‌ కాన్సెప్ట్‌  అవార్డును పొందారు.
2013లో మానవత ఫౌండేషన్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు.
2013  సుబ్బారావు ఉత్తమ రైతు అవార్డు

ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం
రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభానికి పాలేకర్‌ చెబుతున్న జీరో బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం. 700 అడుగుల బోర్‌ వేస్తే తప్ప నీటి చుక్క జాడ దొరకని ప్రాంతంలో పాలేకర్‌ విధానాల వల్లే లాభసాటి ప్రకృతి వ్యవసాయం చేయడం సాధ్యం. సతీమణి యోగిత, స్నేహితుడు గుణశేఖర్‌లు పూర్తి సహాయ సహకాలు అందిస్తున్నారు. –ఎం.సి.వి.ప్రసాద్‌.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top