ఏపీఎన్జీవోల సమ్మెపై దాఖలైన పిటిషన్ మీద విచారణను హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
సమ్మె కేసు విచారణ 16కు వాయిదా
Sep 2 2013 1:33 PM | Updated on Mar 23 2019 9:03 PM
ఏపీఎన్జీవోల సమ్మెపై దాఖలైన పిటిషన్ మీద విచారణను హైకోర్టు ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రభుత్వం నియంత్రించలేని పక్షంలో తామే చర్యలు తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. గవర్నర్ ఇచ్చే నివేదిక ఆధారంగా నియంత్రణ చర్యలు చేపడుతామని కూడా వివరించింది. అయితే, ప్రస్తుతం ఏపీఎన్జీఓలపై నో వర్క్ - నో పే జీవో నెం. 177 అమలులో ఉందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు అధికార నోట్ ఏమీ లేదని ఆయన అన్నారు. ఒకవేళ
విభజన జరిగినా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెప్పారు. గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడి ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది రాలేదని ఆయన చెప్పారు.
ఉద్యోగుల ప్రాథమిక హక్కులను ఎవరూ హరించలేరని, ఊహాజనితమైన అంశాలపై సమ్మె చేయడం తగదని అన్నారు. విభజన చేస్తున్నట్లు ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా అని బెంచి ప్రశ్నించగా, కేంద్రంలోను.. రాష్ట్రంలోను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఇక ప్రభుత్వం నుంచి కూడా నిర్ణయం వచ్చేస్తే ఇక చేయగలిగింది ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడే నిరసన తెలియజేస్తున్నామని అన్నారు.
Advertisement
Advertisement