
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక అందజేస్తున్న ఆర్టీసీ విలీన నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల పెద్ద ఎత్తున ఇంధనం ఆదా అవుతుందని విద్యుత్తు బస్సులపై ఏర్పాటైన నిపుణుల కమిటీ తెలిపింది. వ్యయ నియంత్రణతోపాటు పర్యావరణ పరిరక్షణలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంది. ఆర్టీసీ విలీనంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు ఎలక్ట్రిక్ బస్సులపై నివేదిక సమర్పించింది. నిపుణుల కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులతో పాటు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తదితరులు ముఖ్యమంత్రిని కలసిన వారిలో ఉన్నారు.
నిపుణుల కమిటీ సూచనలు ఇవీ...
- ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున ప్రవేశపెట్టేందుకు ఆర్థిక వనరుల కోసం ‘పర్యావరణ పరిరక్షణ నిధి’తోపాటు ప్రత్యేకంగా ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్స్) బాండ్లు జారీ చేయాలి.
- జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందగలిగితే వీలైనంత త్వరగా ఆర్టీసీలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టవచ్చు. తద్వారా పెద్ద ఎత్తున ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉంది.
- విద్యుత్ వాహనాల చార్జింగ్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన విద్యుత్‌కు బదులుగా సౌర విద్యుత్‌ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలి. ఇందుకోసం సంస్థ భవనాలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియలో సాంకేతిక, ఆర్థికపరమైన అంశాలు చూడాలి.
- సంస్థలో పూర్తి స్థాయిలో విద్యుత్ వాహనాల వినియోగంతో ఆదా అయ్యే ఇంధనం విలువను నగదు రూపంలో పరిగణించి ఆ మొత్తాన్ని ఇంధన ధరలో రాయితీగా చూపితే తక్కువ వడ్డీకే సులభంగా రుణాలు పొందవచ్చు.
- తిరుమలలో భక్తులకు ఉచితంగా సేవలందిస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో వీలైనంత త్వరగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడితే టీటీడీ కాంక్షించే పర్యావరణ పరిరక్షణ సాకారమవుతుంది.
- ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం అలిపిరితో పాటు కొండపైన స్థలం కేటాయించాలి. ఈ మేరకు ప్రభుత్వం టీడీడీకి సూచనలు జారీ చేయాలి.
- రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించి మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలి.
- స్థూల వ్యయ కాంట్రాక్టు (జీసీసీ)ల సమీక్ష కోసం తగిన యంత్రాంగం ఏర్పాటుతో కాంట్రాక్ట్ సమయంలో అవకతవకలకు తావు లేకుండా చేయవచ్చు.
- ఆర్టీసీలో 350 ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకోవాలి.
- ‘ఫేమ్–2’ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాధాన్య క్రమంలో చేపట్టాలి.