బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!

Farmers Demand Return Of Land Taken for Machilipatnam Urban Development Authority - Sakshi

బందరుపోర్టు నిర్మాణానికి ఫిబ్రవరిలో భూములు తీసుకున్న ముడా

ఎకరానికి రూ. 40 లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం

ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వని పరిస్థితి

భూములు తిరిగి ఇచ్చేయాలని అడిగితే బెదిరింపులు

సాక్షి, మచిలీపట్నం: ఇచ్చిన హామీ నెరవేర్చాలని అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు తలంచలేదు.. సరిగ్గా ఎన్నికలకు మరో రెండు నెలలు ఉందనగానే ఒక్కసారిగా గుర్తొచ్చాయి..  ఇంకేముంది ‘పసుపు– కుంకుమ’ మాదిరిగానే ఆర్భాటంగా ఇదిగో బందరు పోర్టు అంటూ ఓ పైలాన్‌ను ఆవిష్కరించేశారు. అందుకోసం టీడీపీ నాయకుల మౌఖిక ఆదేశాలతో రైతుల భూములను మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) అధికారులు అనధికారికంగా స్వాధీనం చేసుకుని నిర్మాణాలు సాగించారు. సీన్‌ కట్‌చేస్తే.. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ. 40 లక్షల ఊసు లేదు.. తిరిగి భూములిచ్చేయండని అడిగితే చీదరింపులు.. వెరసి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారుల ఆధీనంలో ఉన్న తమ భూములను విడిపించాలని మండల పరిధిలోని మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయా గ్రామాల సరిహద్దులో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభాప్రాంగణానికి, పైలాన్‌ నిర్మాణానికి ఇరు గ్రామాల రైతులకు చెందిన 20 ఎకరాలను వినియోగించారు. అప్పట్లో ఎకరం భూమిని రూ. 40 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు, టీడీపీ నాయకులు అట్టహాసంగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా భూమిని ఖాళీ చేయడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

చిత్తశుద్ధి లేని పనులకు రూ. కోట్లు
గడిచిన ఐదేళ్లు టీడీపీ నాయకులు బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు గెలిస్తే ఆరు నెలల్లో బందరుకు ఓడను తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. ఐదేళ్లు భూ సేకరణ, భూ సమీకరణ, మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ(మడా), మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ముడా) ఏర్పాటు అంటూ కాలయాపన చేశారు. అయితే ముడాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఐదేళ్లు హారతికర్పూరం చేశారు. ఇక 2019 ఎన్నికల దగ్గరపడే సమయానికి ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.

ఐదేళ్లు ఆడిన నాటకానికి చివరి అంకంలో రక్తికట్టించే ప్రయత్నంలో భాగంగానే మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతుల భూములను వినియోగించుకున్నారు. బందరు పోర్టు పనులు పూర్తి చేయలేమని, అయితే పనులు ప్రారంభం అంటూ నియోజకవర్గ ప్రజలను మరో మారు వంచించేందుకు ఎన్నికల ముందు, ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకొచ్చి హడావుడి చేశారు. సభ నిర్వహణకు, హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు, పైలాన్‌ నిర్మాణానికి 20 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని సభను మమ అనిపించారు. 

ముడా అధికారుల దౌర్జన్యం
భూములను ఖాళీ చేయమంటూ ముడా అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ముందుగా ఎకరం భూమికి రూ. 40 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నగదు చెల్లించకపోవడంతో ఇటీవల కొందరు రైతులు ముడా కార్యాలయానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ముడా అధికారులు తమపై విరుచుకుపడినట్లు కొందరు రైతులు చెబుతున్నారు. భూములకు సంబంధించిన కాగితాలను తీసుకురావాలని, లేదంటే భూములను ఆన్‌లైన్‌ అడంగళ్‌లో నుంచి తప్పిస్తామని, రిజిస్ట్రేషన్‌లు నిలిపివేస్తామని, ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని రైతులు వివరిస్తున్నారు. 

ఆగిపోయిన సాగు..
ప్రస్తుతం ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏటా తొలకరి వర్షాలను ఆసరాగా తీసుకుని రైతులు ఈ భూముల్లో వేరుశనగ సాగు ప్రారంభిస్తారు. భూముల్లో కంకర, పైలాన్‌ ఉండటంతో సాగు చేయలేకపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు రైతులు కంకర లేని ప్రాంతంలో పొలాలను దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ముడా వైస్‌ చైర్మన్‌ విల్సన్‌బాబును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలిపారు. 

భూమిని సాగుకు పనికిరాకుండా చేశారు
ముడా అధికారులు ఆక్రమించిన భూమిలో నాకు 2.50 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో భూమి ఇవ్వమని చెప్పాం. టీడీపీ నాయకులు, ముడా అధికారులు బలవంతంగా భూమిని తీసుకున్నారు. పోలీసు కేసులు పెడతామని బెదిరించారు. దీంతో ఎవరికి చెప్పుకోలేకపోయాం. నా భూమిలో కొంత భాగం పైలాన్‌ కట్టారు. మిగిలిన భూమిలో కంకర పోశారు. ఇప్పుడు సాగు చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది. నా కుటుంబానికి ఈ భూమి జీవనాధారం. భూమిలో ఉన్న కట్టడాలను తీసేయ్యాలని ఇటీవల ముడా అధికారులను కలిసి విన్నవించుకున్నాం. వాళ్లు మమ్మల్ని పలు రకాలుగా బెదిరించారు. 
– మేకా వెంకటశివ, రైతు, గోపువానిపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top