నవరత్నాల బడ్జెట్‌కు కసరత్తు!

Exercise for Navratnas Budget - Sakshi

ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన  

శాఖల వారీగా ప్రతిపాదనల సేకరణ 

రెండు రోజుల పాటు బడ్జెట్‌ అంచనాల సమీక్షలు 

ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు 

పెండింగ్‌ బకాయి రూ.1500 కోట్లు విడుదల చేయాలని వినతి 

ప్రతి జిల్లాలో బియ్యం బ్యాగుల తయారీ యంత్రాలు ఏర్పాటు 

సెప్టెంబర్‌ నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా బియ్యం పంపిణీ  

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన నవరత్నాల అమలు దిశగా బడ్జెట్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తొలి బడ్జెట్‌ను రూపొందించేందుకు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని మంత్రిత్వ శాఖల నుంచి నవరత్నాల అమలుకు అవసరమయ్యే నిధులతో పాటు ఆయా శాఖలకు ఎంత మొత్తం కావాలన్న వివరాలను రెండు రోజుల పాటు సేకరించనున్నారు. సోమవారం సచివాలయంలో జరిగిన బడ్జెట్‌ అంచనాల సమీక్షలో భాగంగా రోడ్లు భవనాలు, రవాణా, పశుసంవర్థక శాఖ, పర్యాటకం, పౌరసరఫరాలు, వైద్యం, మహిళా,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం, గృహనిర్మాణ శాఖ మంత్రులతో ఆర్థికమంత్రి విడివిడిగా భేటీ అయ్యి వివరాలు సేకరించారు. 2019–20 సంవత్సరానికి నవరత్నాల అమలుకు ఏ మేరకు బడ్జెట్‌ కేటాయింపులు చేయాల్సి ఉంటుందో ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ప్రెజంటేషన్‌ రూపంలో ఆర్థికమంత్రికి వివరించారు. ప్రతిపాదనలు అందించిన మంత్రులు.. 

సమీక్షలో పాల్గొన్న అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారుల నిర్మాణాన్ని ప్రాధాన్యతా క్రమంలో చేపడతామని, రహదారుల భూసేకరణకు కావల్సిన నిధులతో పాటు,  రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా విజయవాడ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను పూర్తిచేస్తామని పునరుద్ఘాటించారు. సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ.. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించాలని, ఇందుకుగాను రూ. 6,900 కోట్లు అవసరమవుతాయన్నారు. రవాణా శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సమాచార పౌరసంబంధాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థికమంత్రికి సమర్పించామని చెప్పారు. బుధవారం మరొకసారి ఆర్థిక మంత్రితో సమావేశం అవుతామని, అప్పుడు మరిన్ని అంశాలపై చర్చిస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాసరావు, కొడాలి నాని, ఆళ్ల నాని, తానేటి వనిత, పాముల పుష్ప శ్రీవాణి, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు పాల్గొన్నారు. తమ శాఖలకు కావాల్సిన నిధుల వివరాలను ఆర్థికమంత్రికి విన్నవించారు.  

పేదల బియ్యం కోసం రూ. 5,600 కోట్లు 
పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు రూ.5,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటితో పాటు పెండింగ్‌లో ఉన్న మరో రూ.1500 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ప్రత్యేకంగా తయారు చేసిన ఐదు, పది, పదిహేను కిలోల బ్యాగుల్లో సెప్టెంబర్‌ నుంచి గ్రామ వలంటీర్ల ద్వారా పేదల ఇళ్లకే వెళ్లి బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులున్నాయి. ఆ మేరకు నాణ్యమైన బియ్యాన్ని ఏ విధంగా సేకరించాలి, ప్రత్యేకంగా బ్యాగుల తయారీకి అయ్యే ఖర్చు, బడ్జెట్‌ ప్రతిపాదనలు తదితర అంశాలపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ సోమవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో మొదటగా రెండు లేదా మూడు జిల్లాల్లో ఇంటింటికీ బియ్యం పంపిణీ పథకాన్ని అమలు చేసే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఐదు, పది, పదిహేను కిలోల బియ్యం బ్యాగుల తయారీకి సంబంధించిన యంత్రాలను ఢిల్లీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కమిషనర్‌ కోన శశిధర్‌ ఇటీవల పరిశీలించారు.

వాటి పనితీరుపై సంతృప్తిగా ఉండడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యంత్రాలను ఏర్పాటు చేసిన అనంతరం.. ప్రతి జిల్లాలోనూ ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన 25 శాతం నూకలు, మరో 40 శాతం బియ్యం తినడానికి వీలులేని విధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెప్టెంబర్‌ నెల నుంచి అలాంటి బియ్యానికి స్వస్తి పలకాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఆగమేఘాలపై యంత్రాంగం కదిలి సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. 1000, 1010, 1001 రకం బియ్యాన్ని పలు జిల్లాల్లో రైతులు సాగు చేస్తున్నా ఆ రకం బియ్యం తినడానికి ఇష్టపడడం లేదని అధికారులు గుర్తించారు. దీంతో వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి సోనా, బీపీటీ తదితర రకాల వరి సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు వివరించాలని అధికారులు ప్రత్యేకంగా చర్చించారు. కాగా, నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.వెయ్యి కోట్ల అదనపు భారం పడనుంది.  

బడ్జెట్‌లో గిరిజన ఆర్థిక ప్రోత్సాహక పథకాలకు పెద్దపీట
ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
బడ్జెట్‌ ప్రతిపాదనల్లో గిరిజనులకు ఆర్థిక ప్రోత్సాహక పథకాలు, విద్య, వైద్యానికి పెద్ద పీట వేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలపై మంత్రి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2019–20లో ఆర్థిక శాఖ కేటాయించిన తాత్కాలిక కేటాయింపుల కంటే అదనంగా రూ.1,142.13 కోట్లను కలిపి మొత్తం రూ.3,542.22 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇందులో రూ.132.11 కోట్లు నవరత్నాల అమలుకు కేటాయించామన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, డైరెక్టర్‌ రంజిత్‌ బాషా, అడిషనల్‌ డైరెక్టర్‌ ఇ.రవీంద్రబాబు, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ శేషుకుమార్, గురుకులం కార్యదర్శి భాను ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top