ఏజెన్సీ విద్యార్థులపై రోగాల పంజా...

diseases to agency students

ఆశ్రమ పాఠశాలల్లోనే పౌష్టికాహార లోపం

విద్యార్థుల్ని పట్టి పీడిస్తున్న రక్తహీనత

ఒక్కో విద్యార్థికి రూ.850 ...ఏటా రూ.7 కోట్లు కేటాయింపు

గుడ్డు, పప్పు, పాలు, రాగిమాల్ట్‌... ఇలా జాబితా చాంతాడంత

అవన్నీ సక్రమంగా అందితే ఎందుకిలా అనేదే ప్రశ్న

వైద్య పరీక్షలు చేస్తున్నా ఆదిలో ఎందుకు గుర్తించడం లేదో...

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  ఏజెన్సీలో ఏ రోగమొచ్చినా రక్తహీనతే కారణమంటున్నారు. పౌష్టికాహారం సరిగా తీసుకోకపోవడం, రక్షిత మంచినీరు తాగకపోవడంతో ఈ సమస్య వస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న గిరిజనులకు సక్రమంగా ఆహారం, నీరు అందలేదంటే సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ వసతి గృహాల్లో సహితం పౌష్టికాహార సమస్య వస్తోందంటే ఇది ఎవరి వైఫల్యమో అధికారులు, పాలకులే చెప్పాలి. లోపమెక్కడో, వైఫల్యమెవరిదో ఆత్మ పరిశీలన చేసుకోవల్సిన అవసరం అధికారులపై...
పాలకులపై ఉంది.

విద్యార్థులకు సోకుతున్న కాళ్లవాపులు
ఇటీవల చింతూరు గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కాళ్లవాపు వ్యాధి సోకింది. వీరికి చేసిన రక్త పరీక్షల ఫలితాల్లో విటమిన్‌ బి1 లోపం ఉన్నట్టుగా తేలింది. ఈ లోపం కారణంగానే కాళ్లవాపు వ్యాధి వచ్చిందని రంగరాయ వైద్య కళాశాల వైద్య  బృందం నిర్ధారణకొచ్చింది. అన్నం వార్చకుండా తినడంతోపాటు ముడి బియ్యం తినడం వల్ల విటమిన్‌ బి లోపం వస్తుందని చెప్పారు. అలా చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు.  గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం అధికారులు కూడా తాగునీటిలో అధిక ఐరన్‌ శాతం ఉండటమే కాళ్ల వాపు వ్యాధికి కారణమై ఉండొచ్చని అంచనా వేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కారణమని చెబుతుండడంతో బాధితుల్లో అయోమయం నెలకుంది.

విద్యార్థులకేదీ పౌష్టికాహారం...
గిరిజన గ్రామాల్లో ఉంటున్న వారికి ఈ సమస్యలు వచ్చాయంటే  పౌష్టికాహారం లోపం అనుకోవచ్చు. కానీ అధికారుల పర్యవేక్షణలో పౌష్టికాహార సరఫరాతో నడిచే ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ రకమైన ఆరోగ్య సమస్యలు ఎందుకు వచ్చాయంటే సంబంధితాధికారుల వద్ద సమాధానం లేదు. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు కాళ్లవాపు వచ్చిందంటే సరైన పౌష్టికాహారం అందడం లేదన్నది సుస్పష్టం. ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సేవలు, పరీక్షలు కూడా అంతంతమాత్రమేనని ఈ ఘటన రుజువు చేస్తోంది.

వసతి గృహాల్లో జరుగుతున్నదేంటి?
మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ప్రతి విద్యార్థికి నెలకు రూ.750, ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.850 బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. సుమారు ఏటా రూ.6 కోట్ల 82 లక్షల వరకు డైట్‌ కోసమే ఖర్చుపెడుతున్నా పౌష్టికాహారం ఎటుపోతోందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం టిఫిన్‌– కిచిడీ, ఉప్మా, పులిహోర (రోజుకు ఒక రకం), రాగిమాల్ట్‌ పెట్టాలి. మధ్యాహ్నం భోజనం పప్పుతో ఆకుకూర, కోడిగుడ్డు, అరటిపండు, సాంబారు ఇవ్వాలి. సాయంత్రం స్నాక్స్, అలసందలు, శనగలు, వేరుశెనగ అచ్చులు, పాలు, బెల్లం అందజేయాలి. సాయంత్రం అన్నంతో కూరగాయల కూర, రసం పెట్టాలి. ఇలా పద్ధతి ప్రకారం మెనూ అమలైతే రక్త హీనత ఎందుకు బయటపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

తాగునీటికి అదే పరిస్థితి...
ఏజెన్సీలోని రంపచోడవరం, దేవీపట్నం, వై రామవరం అప్పర్‌పార్టు, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, వీఆర్‌ పురం, కూనవరం తదితర మండల్లాలోని చాలా గ్రామాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో 300 గ్రామాలకు రక్షిత మంచినీరు అందడం లేదు. ఈ గ్రామాలకు వేసిన బోర్లు పనిచేయకపోవడం, మంచినీటి పథకాలు లేకపోవడంతో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామాల్లోనే ఉంటున్న ఆశ్రమ పాఠశాలలకు అదే దుస్థితి ఎదురవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top