'ఆప్ తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్' | Delhi assembly elections result repeat in andhra pradesh, says YS Jagan mohan Reddy | Sakshi
Sakshi News home page

'ఆప్ తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్'

Feb 24 2015 10:36 PM | Updated on Jul 25 2018 4:09 PM

'ఆప్ తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్' - Sakshi

'ఆప్ తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్'

ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కానున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పునరావృతం కానున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో వైఎస్ఆర్ సీపీ క్లీన్స్వీప్ చేసే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆయన వెల్లడించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా మార్తాడులో మాట్లాడుతూ...  చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

ఇదే అంశంపై  అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశామని.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన జాబితాను కూడా ఆయనకు అందజేశామని తెలిపారు. కానీ తామిచ్చిన జాబితాను చంద్రబాబు అపహాస్యం చేశారని తెలిపారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారని చంద్రబాబు వెటకారం చేసిన సంగతిని వైఎస్ జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి చాలా మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాల వల్లే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని విమర్శించారు. అలాగే మరికొంతమంది జీవచ్ఛావాల్లా బతుకుతున్నారన్నారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ చంద్రబాబు ప్రకటనలు చేశారు.

జాబు రావాలంటే బాబు రావాలన్నారు... జాబు ఇవ్వకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు... బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తామన్నారు... కానీ సీఎం అయ్యాక ఆయన ఏమీ చేయలేదంటూ బాబుపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులపై రూ. 12 వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు.  ఎన్నికల సమయంలో రూ. 87 వేల కోట్లు ఉన్న రైతు రుణాలు... ఇప్పుడు రూ. 99 వేల కోట్లకు చేరాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు రుణాలు కట్టలేదు... ఫలితంగా వడ్డీ లేని రుణాలు నుంచి 14 శాతం నగదు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. 

రూ. 57 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా ఉంటే రైతులకు రూ. 13 వేల కోట్లు మాత్రమే అందాయని చెప్పారు. ఎవరైనా మోసం చేస్తే 420 కేసు నమోదు చేస్తారు... ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబుపై ఏ కేసు పెట్టాలని వైఎస్ జగన్ ఈ సందర్బంగా ప్రశ్నించారు. కళ్లార్పకుండా అబద్దాలు ఆడే నైజం చంద్రబాబుదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రుణమాఫీకి రూ. 4600 కోట్లు మాత్రమే ఇచ్చి సన్మానాలు చేయించుకున్న ఘనత చంద్రబాబుదని అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే రైతులకు క్రాప్ ఇన్స్యూరెన్స్, ఇన్పూట్ సబ్సిడీ, కొత్త రుణాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా ధరలు అమాంతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. హంద్రీనివా ప్రాజెక్ట్ తొలిదశ పనులు రూ. 5800 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయితే ఆ పనులు తానే చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement