
ఆర్భాటంగా బాబు ప్రమాణం
సమైక్యాంధ్రప్రదేశ్ విభజనానంతరం అవశేషాంధ్రప్రదేశ్ నూతన సీఎంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం అత్యంత ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేశారు.
అతిరథ మహారథులు హాజరు
నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం సీఎంగా ప్రమాణ స్వీకారం
బాబు, 19 మంది మంత్రులతో ప్రమాణం చేయించి వెళ్లిపోయిన గవర్నర్.. అద్వానీ, రాజ్‌నాథ్, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరు
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ విభజనానంతరం అవశేషాంధ్రప్రదేశ్ నూతన సీఎంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం అత్యంత ఆర్భాటంగా ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు - విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా భారీ ఏర్పాట్ల మధ్య ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబుతో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల ముఖ్యనేతలు సహా అతిరథమహారథులు వేదికపై ఆశీనులవ్వగా ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా రాత్రి 7:27 గంటలకు చంద్రబాబు ప్రమాణం చేశారు. తెలుగులో దైవసాక్షిగా ఆయన తన ప్రమాణాన్ని చదివారు. సమయానికి పది నిముషాలు ముందే వేదిక మీదకు గవర్నర్, చంద్రబాబు ఇతర ముఖ్యులు చేరుకున్నా ముహూర్తం వరకు వేచి ఉన్నారు. ముహూర్తం సమీపించిన తరుణంలో గవర్నర్ ఆదేశం మేరకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు చంద్రబాబును కోరారు. ఆ తరువాత ఆయనతో ప్రమాణం చేయించాల్సిందిగా గవర్నర్‌ను కోరారు. గవర్నర్ చంద్రబాబుతో పదవీ ప్రమాణం, రహస్య పర్యవేక్షణ ప్రమాణం చేయించారు. చంద్రబాబు తర్వాత 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రం కష్టాల్లో ఉందంటూ బాబు ప్రసంగం...
ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు, మంత్రులతో గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు. ఆతరువాత గవర్నర్ అక్కడినుంచి వెళ్లిపోగా చంద్రబాబు, ఇతర నేతలు సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తాము మాట్లాడాల్సి ఉంటుందని కేంద్రమంత్రులు, ఇతర ముఖ్యులకు ముందుగా తెలియదు. వేదికమీదకు చేరాక పరిచయ కార్యక్రమాలతో వారి పేర్లను ఇతర వివరాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలకు వివరించారు. వెంక య్యనాయుడు చదువుతుండగా జాతీయనేతలైన ఎల్.కె.అద్వానీ తదితరులు లేచి ప్రజలకు చేతులూపుతూ అభివాదం చేశారు. అయితే కొంతమంది నేతలు మాత్రం కిందనే ఉండిపోవడంతో వేదికమీదకు రాలేకపోయారు. ఆ తరువాత ఆ నేతలను కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబును ఆశీర్వదించాల్సిందిగా ఆయన కోరడంతో వారంతా మాట్లాడారు.
రాష్ట్రానికి సహకరిస్తామని, చంద్రబాబు మంచి పరిపాలనా దక్షుడని పొగిడారు. చంద్రబాబు ప్రసంగంలో రాష్ట్రానికి ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి సంబంధించిన ఆటంకాలపై ఎక్కువసేపు మాట్లాడారు. ప్రజలంతా రుణమాఫీతో సహా ఇతర హామీల అమలుపై ఎన్నో ఆశలుపెట్టుకోవడంతో వారికి ప్రస్తుత పరిస్థితులను వివరించి నచ్చచెప్పే తీరులో ఆయన ప్రసంగం సాగింది. ప్రస్తుతం రాష్ట్రం కష్టాల్లో ఉందని, ప్రజలంతా తనకు సహకరించాలని ఆయన పదేపదే ప్రజలను కోరారు. అలాగే ఉద్యోగులకు సంబంధించి పదవీవిరమణ వయసు పెంపు మినహా ఇతర డిమాండ్లపై చంద్రబాబు ఏమాటా చెప్పలేదు. వాటితో పాటు ఇతర హామీలకు సంబంధించి తదుపరి పరిస్థితులను అనుసరించి ముందుకు వెళ్తామని తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా పవన్, వివేక్ ఒబెరాయ్
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, బాలీవుడ్ నటుడు వివేక్‌ఒబెరాయ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్‌కల్యాణ్ కనిపించిన ప్రతీసారీ సభికులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. వివేక్‌ఒబెరాయ్‌ను చంద్రబాబునాయుడు సభకు ప్రత్యేకంగా పరిచయం చేశారు. చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్ సభావేదిక వద్ద ముఖ్యులను పలుకరిస్తూ లోపలకు ఆహ్వానిస్తూ ప్రత్యేక ఆక ర్షణగా కనిపించారు.
హాజరైన హేమా హేమీలు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారధులు హాజరయ్యారు. ఎన్‌డీఏ అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, రాజనాథ్‌సింగ్, ఎం.ఎం.జోషీ, వెంకయ్యనాయుడు, ప్రకాశ్‌జవదేకర్, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్‌బాదల్, రాజస్థాన్ సీఎం వసుంధరరాజే, చత్తీస్‌ఘడ్ సీఎం రమణసింగ్, గుజరాత్ సీఎం ఆనందిబెన్‌పటేల్, గోవా సీఎం మనోహర్‌పారికర్, నాగాలాండ్ సీఎం టి.ఆర్.జలన్, పంజాబ్ డిప్యుటీ సీఎం సుఖవీర్‌సింగ్‌బాదల్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే, కేంద్రమంత్రులు అనంతకుమార్, అశోక్‌గజపతిరాజు, కల్‌రాజ్‌మిశ్రా, డాక్టర్ హర్షవర్థన్, పీయూష్‌గోయల్, నిర్మలాసీతారామన్, ఎండీఎంకే నేత వైగో, రాజ్యసభ ఉపాధ్యక్షుడు కురియన్, తమిళనాడు మంత్రులు ైవె ద్యలింగం, బాబ్జీ, ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్‌సింగ్ చౌతాలా, శిరోమణి అకాళీదళ్ నేత నరేష్ గుజ్రాల్, బీజేపీ నేతలు విజయ్‌గోయెల్, సీపీఐనేత నారాయణ, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు టీడీపీ, బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఆర్.కృష్ణయ్య, ఉమామాధవరెడ్డి, నామానాగేశ్వరరావు, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు సకుటుంబంగా సభకు హాజరయ్యారు. బాలకృష్ణ సతీమణి, కుమార్తెలు, కుమారుడు, హరికృష్ణ, జూనియర్ ఎన్‌టీఆర్, తారకరత్న తదితరులు హాజరయ్యారు.
బాబు కేబినెట్‌లో 19 మంది మంత్రులు
1. కె.ఇ.కృష్ణమూర్తి
2. యనమల రామకృష్ణుడు
3. నిమ్మకాయల చినరాజప్ప
4. చింతకాయల అయ్యన్నపాత్రుడు
5. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
6. దేవినేని ఉమామహేశ్వరరావు
7 పి.నారాయణ
8. పరిటాల సునీత
9. పత్తిపాటి పుల్లారావు
10. కామినేని శ్రీనివాస్
11. గంటా శ్రీనివాసరావు
12. పల్లె రఘునాథరెడ్డి
13. పీతల సుజాత
14. కె.అచ్చెన్నాయుడు
15. సిద్ధా రాఘవరావు
16. కిమిడి మృణాళిని
17. కొల్లు రవీంద్ర
18. రావెళ్ల కిశోర్‌బాబు
19. పైడికొండల మాణిక్యాలరావు