కాలువల మరమ్మతు పనులను టెండర్ పద్ధతిపై కాకుండా నామినేషన్ పద్ధతిపై అస్మదీయులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది.
ఏలూరు : కాలువల మరమ్మతు పనులను టెండర్ పద్ధతిపై కాకుండా నామినేషన్ పద్ధతిపై అస్మదీయులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో జారీ చేశారు. ఆయకట్టుదారుల కమిటీల పేరుతో రైతులకు బదులుగా తెలుగు తమ్ముళ్లకు చోటు కల్పించ డం ద్వారా పనుల్ని కట్టబెట్టి కాసులు వెనకేసుకునే పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఏప్రిల్ నుంచి వారికి పల్లెల్లో కాసులు కురిపించేందుకు రంగం సిద్ధమవుతోంది.
త్వరలో ఆయకట్టుదారు కమిటీల చైర్మన్ల ఎంపిక
జిల్లాలో గోదావరి, కృష్ణా డెల్టాల కింద ఏటా 10 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. సాగునీటి సంఘాలు మనుగడలో లేకపోవడంతో ఆయకట్టుదారులతో కమిటీలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలో 1,462 మైనర్ ఇరిగేషన్ చెరువులున్నాయి. ప్రతి గ్రామంలో సగటున రెండు చెరువులు ఉంటాయి. ఒక్కొక్క చెరువు మరమ్మతుకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వెచ్చించే అవకాశం కల్పిస్తున్నారు.
కాలువ మరమ్మతులు సైతం ఇదే రీతిన సాగుతాయి. రూ.లక్ష నుంచి రూ.5 లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై ఆయకట్టుదారు కమిటీలకు అప్పగిస్తారు. ఆ కమిటీల నియామకంలో టీడీపీ నాయకులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందాయి. ఆయకట్టుదారు కమిటీ చైర్మన్, సభ్యులను ఎంపీడీవో, తహసిల్దార్ల పర్యవేక్షణలో గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంది.
నీటి తీరువా సొమ్ములకు రెక్కలు
ఏటా రైతులు నీటితీరువా కింద రెండు పంటలకు కలిపి రూ.57 కోట్లను చెల్లిస్తున్నారు. ఈ సొమ్ముతోనే కాలువల బాగుసేత, పూడిక తొలగింపు, షట్టర్లు, చిన్నపాటి మరమ్మతులను చేయించాల్సి ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. దాదాపు ఆ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ల స్థానంలో టీడీపీ నాయకులే పనులు చేజిక్కించుకుని నిధులు దండుకునేందుకే ఆయకట్టుదారుల కమిటీలను నియమిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.